భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశలో

భారత్–అమెరికా మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై ఉత్కంఠతకు త్వరలో ముగింపు కలగనుంది. వాషింగ్టన్‌లో జరుగుతున్న ఉన్నత స్థాయి చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం. జూలై 9వ తేదీలోగా ఒప్పందం కుదరకపోతే, ప్రస్తుతం నిలిపివేసిన అమెరికా సుంకాలు తిరిగి అమలులోకి వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో, ఇరు దేశాల ప్రతినిధులు చర్చలను వేగవంతం చేశారు.

జీఎంసీ పంటలపై ఒత్తిడి – భారత వ్యతిరేకత

ఈ ఒప్పందంలో ముఖ్య అంశంగా నిలిచింది వ్యవసాయం. అమెరికా, తమ దేశంలో ఉత్పత్తయ్యే జన్యు మార్పిడి (GM) పంటలను భారత మార్కెట్లోకి అనుమతించాలని ఒత్తిడి తెస్తోంది. అయితే దేశీయ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ ప్రతిపాదనను భారత్ స్పష్టంగా తిరస్కరిస్తోంది. అంతేగాక, డెయిరీ రంగంలోనూ అమెరికా ఉత్పత్తులకు మార్కెట్‌ ప్రవేశం కల్పించాలని కోరుతుండగా, దీనికి భారత్ గట్టి ప్రతిపక్షం వ్యక్తం చేస్తోంది. గ్రామీణ జీవనోపాధి, ఆహార భద్రత దృష్ట్యా వ్యవసాయం, డెయిరీ రంగాలను ఒప్పందం పరిధిలోకి తీసుకురావొద్దని భారత వాణిజ్య బృందం వాదిస్తోంది.

ఉపాధి కల్పించే రంగాలపై భారత్ దృష్టి

అమెరికా డిమాండ్లకు ప్రతిస్పందనగా, భారత్ మాత్రం దేశీయ ఉపాధి కల్పనకు దోహదపడే వస్త్రాలు, పాదరక్షలు, తోలు ఉత్పత్తులపై ఉన్న సుంకాలను తగ్గించాలని కోరుతోంది. వీటిపై భారీగా సుంకాలు కొనసాగుతున్న నేపథ్యంలో, వాటిని తగ్గించకపోతే వాణిజ్య ఒప్పందానికి పెద్ద ప్రయోజనం ఉండదని భారత్ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి \$500 బిలియన్‌కు పెంచాలన్న లక్ష్యం కుదిరే ఒప్పందంపై ఆధారపడి ఉంటుందని భారత ప్రతినిధులు వ్యాఖ్యానించారు.

ట్రంప్ సానుకూల స్పందన

ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై సానుకూలంగా స్పందించారు. “భారత్‌తో త్వరలోనే తక్కువ సుంకాలతో కూడిన వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశముంది. ఇప్పటివరకు వారు తమ మార్కెట్‌ను చాలామందికి తెరచేయలేదు. కానీ త్వరలోనే మార్పు వస్తుందనే నమ్మకం ఉంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఒప్పందం విఫలమైతే 26% సుంకాల మళ్లీ అమలు?

ఒప్పందం జూలై 9వ తేదీలోగా కుదరకపోతే, ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేసిన 26% దిగుమతి సుంకాలు మళ్లీ అమలులోకి రావచ్చు. అయితే, ఈ సుంకాలు భారత్‌కు తీవ్రమైన నష్టం కలిగించవని, ప్రపంచ మార్కెట్లో ఇతర పోటీదారులతో పోలిస్తే మనకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపుగా నిలుస్తున్న ఈ ఒప్పందంపై నిర్ణయం రానున్న 48 గంటల్లో స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.

Read More : ఘన సత్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ

One thought on “భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశలో

Comments are closed.