ఎరువుల సరఫరాకు చైనా అంగీకారం

భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఏడాది కాలంగా నిలిచిపోయిన ఎరువులు, టన్నెల్ బోరింగ్ మెషీన్లు (TBM), మరియు ఆటోమొబైల్ రంగానికి అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరాను తిరిగి ప్రారంభించేందుకు చైనా అంగీకరించింది. ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వస్తున్నాయని సూచిస్తోంది.

విదేశాంగ మంత్రుల భేటీ

భారత్ పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సోమవారం సమావేశమయ్యారు. గత నెలలో జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు యూరియా, ఎన్‌పీకే, డీఏపీ వంటి ఎరువులతో పాటు ఇతర కీలక వస్తువుల సరఫరా నిలిచిపోయిన విషయాన్ని లేవనెత్తారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చైనా, తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ తన ఎరువుల అవసరాల్లో దాదాపు 30 శాతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నందున ఈ నిర్ణయం రైతులకు ఎంతో ఊరటనిస్తుంది.

అమెరికా, సరిహద్దు వివాదాలపై చర్చ

ఈ భేటీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై కూడా పరోక్షంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అమెరికా నిర్ణయాలు భారత్, చైనా రెండింటినీ ప్రభావితం చేస్తున్నాయని, ఈ అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఇరు దేశాలు దగ్గరగా మెలగడం అవసరమని ఇరుపక్షాలు అభిప్రాయపడ్డాయి.

అయితే, ఈ సమావేశంలో సరిహద్దు వివాదాల ప్రస్తావన రాలేదు. ఈ సున్నితమైన అంశంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, నేడు చైనా ప్రత్యేక ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి బలగాల ఉపసంహరణ ఈ చర్చల్లో ప్రధాన అజెండాగా ఉండనుంది. తైవాన్ విషయంలో భారత్ వైఖరిలో మార్పు లేదని, కేవలం ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల కోసమే దౌత్యపరమైన కార్యకలాపాలు కొనసాగుతున్నాయని జైశంకర్ స్పష్టం చేశారు. ఈ సాయంత్రం వాంగ్ యీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా భేటీ కానున్నారు.

Read More : ఖార్కివ్‌లో రష్యా డ్రోన్ దాడి: పసికందుతో సహా 5 మంది మృతి