భారత్-చైనా సంబంధాలు కొత్త దశలోకి.

భారత్-చైనా సంబంధాలు కొత్త దశలోకి అడుగుపెడుతున్నాయి. గత సంవత్సరం అక్టోబర్‌లో సరిహద్దు ప్రతిష్ఠంభన ముగిసిన తర్వాత ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొన్నట్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలిపారు. ఢిల్లీలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జరిగిన ప్రత్యేక ప్రతినిధుల స్థాయి 24వ విడత చర్చల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు ముందు ఈ భేటీ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో టియాన్జిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారని దోవల్ ధృవీకరించారు.

గత తొమ్మిది నెలలుగా భారత్-చైనా సంబంధాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని ఆయన చెప్పారు. “సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయి. ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి. గత అక్టోబర్‌లో రష్యా కజాన్‌లో మోదీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత కొత్త వాతావరణం ఏర్పడింది. అప్పటి నుంచి రెండు దేశాలు ప్రయోజనం పొందుతున్నాయి” అని దోవల్ వివరించారు.

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ, గత కొన్నేళ్లలో ఎదురైన ఆటుపోట్లు ఎవరికీ మంచివి కాలేదని అన్నారు. మోదీ-జిన్‌పింగ్ భేటీతో సంబంధాల అభివృద్ధికి మార్గదర్శనం లభించిందని, సరిహద్దు సమస్య పరిష్కారానికి ఊతమిచ్చిందని పేర్కొన్నారు. “ఇప్పుడు సరిహద్దుల్లో నెలకొన్న స్థిరత్వం మాకు సంతోషాన్నిస్తుంది. ప్రధాని మోదీ ఎస్‌సీఓ సదస్సుకు రావడం ఎంతో ముఖ్యమని మేం భావిస్తున్నాం” అని ఆయన అన్నారు.

2020లో లడక్‌ సరిహద్దులో గల్వాన్ ఘర్షణల తర్వాత ఇరు దేశాల సంబంధాలు కనిష్ఠ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. 2024 అక్టోబర్ 21న ప్రతిష్ఠంభనకు తెరపడటంతో, ఆ తర్వాత కజాన్‌లో మోదీ-జిన్‌పింగ్ సమావేశమై సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. తాజా చర్చల్లో నమ్మకాన్ని పెంపొందించే చర్యలపై దృష్టి సారించారని తెలుస్తోంది. ఈ పర్యటనలో వాంగ్ యీ ప్రధాని మోదీని కూడా కలవనున్నారు.

Read More : ఎరువుల సరఫరాకు చైనా అంగీకారం