ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్

Rohith Sharma

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయానికి ప్రధాన కారణం స్పిన్నర్లు అని రోహిత్ పేర్కొన్నాడు.

స్పిన్నర్ల ప్రభావం
ఫైనల్ అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ, ఈ విజయానికి వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాల పోషించిన కీలక పాత్రను ప్రస్తావించాడు. టోర్నమెంట్ మొత్తంలో స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని, ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి కీలక బ్రేక్‌త్రూ ఇచ్చినట్లు తెలిపారు.

మ్యాచ్ విశ్లేషణ
న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63), మైకేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (2/45), కుల్దీప్ యాదవ్ (2/40) కీలక వికెట్లు తీశారు.

252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. రోహిత్ శర్మ (76), శ్రేయస్ అయ్యర్ (48), కేఎల్ రాహుల్ (34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్, మైకేల్ బ్రేస్‌వెల్ రెండేసి వికెట్లు తీశారు.

రోహిత్ శర్మ వ్యాఖ్యలు
ఈ విజయాన్ని అభిమానులకు అంకితమిస్తూనే, మైదానంలో వారి మద్దతు హోమ్ గ్రౌండ్ అనిపించేలా చేసిందని రోహిత్ పేర్కొన్నారు. వరుసగా రెండో ఐసీసీ టైటిల్ గెలుచుకోవడం భారత క్రికెట్ చరిత్రలో మరో మైలురాయి అని అన్నారు.

Read More

One thought on “ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్

Comments are closed.