ఎనర్జీ డ్రింక్స్ వల్ల పిల్లలు, టీనేజర్లలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్షణ ఉత్సాహాన్ని అందిస్తాయనే కారణంతో వీటిని ఎక్కువగా తాగుతున్న పిల్లలు ప్రమాదంలో పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
ఎనర్జీ డ్రింక్స్‌లో ఏముంటాయి?
నిపుణుల వివరాల ప్రకారం, ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫీన్, అధిక చక్కెర, ఉత్సాహకారక రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని వేగంగా ఉత్తేజితం చేస్తాయి. కానీ దీర్ఘకాలికంగా వీటి వినియోగం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పిల్లలపై పెరుగుతున్న ముప్పు
అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం, పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వడం అస్సలు సబబు కాదని స్పష్టం చేసింది. పెరుగుతున్న వయస్సులో పిల్లల కిడ్నీలు, గుండె, మెదడు తగిన రీతిలో అభివృద్ధి చెందేందుకు వీటివల్ల ఆటంకం కలుగుతుందని హెచ్చరించింది.
ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే సమస్యలు:
- కెఫీన్ అధికంగా ఉండటంతో మూత్ర విసర్జన పెరిగి కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది.
- ఫాస్ఫోరిక్ యాసిడ్ కారణంగా కిడ్నీలలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
- అధిక చక్కెర కారణంగా ఊబకాయం, డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది.
- ఉత్ప్రేరకాల ప్రభావంతో గుండె వేగం, రక్తపోటు పెరిగి కిడ్నీలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
ప్రత్యామ్నాయంగా ఏం తాగాలి?
నిపుణులు ఎనర్జీ డ్రింక్స్‌కు బదులుగా మంచి నీరు, కొబ్బరి నీరు, పళ్ల రసాలు, కొవ్వు తక్కువగా ఉన్న పాలతో చేసే హెర్బల్ టీలను ప్రోత్సహిస్తున్నారు.
పిల్లలు, టీనేజర్లు ప్రకటనల ప్రభావానికి లోనై ఎనర్జీ డ్రింక్స్‌కి అలవాటు పడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

One thought on “పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ముప్పు: ఆరోగ్య నిపుణుల హెచ్చరిక”
Comments are closed.