బనకచర్ల ప్రాజెక్ట్ అంశంలో కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కే లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్‌రావు మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల పాలన చూసిన ప్రజలకు, కాంగ్రెస్ అంటే ఏమిటో స్పష్టంగా అర్థమైందని వ్యాఖ్యానించారు.
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల యూత్ కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడుతూ… “లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నిస్తూ, ఓటమి భయంతోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్లక్ష్యం చేస్తోందని” ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ కూడా వారం రోజులకు మించి నడిపే స్థితిలో లేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు బహిరంగ సవాలు విసిరిన హరీష్‌రావు, “ఎక్కడైనా చర్చకు సిద్ధం, ఏ టీవీ ఛానెల్ అయినా వద్దు, వస్తారా? చెప్పండి” అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ అబద్ధాలతో మహేష్ కుమార్ గౌడ్ తో పోటీ పడుతున్నారని హరీష్ ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి రావాల్సినది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు గెలవడమే తమ లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యతతో పని చేస్తే విజయం ఖాయమని హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు.
Read More : BRS MLC : కాంగ్రెస్ హామీలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?

One thought on “బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్‌కు నైతిక హక్కు లేదు – హరీష్‌రావు”
Comments are closed.