కాంగ్రెస్‌పై హరీష్ రావు విరుచుకుపాటు

Harish rao

– బీఆర్ఎస్ పాలనను తుడిచిపెట్టే ప్రయత్నం అనర్హం

తెలంగాణలో పాలనపై రాజకీయ విమర్శలు ముదురుతున్నాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం (BRS) అమలు చేసిన మంచి పథకాలను కాంగ్రెస్ (Congress) తుడిచి పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎస్ఆర్ఎస్పీ (SRSP) నీటి నిల్వలు తగ్గినప్పటికీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) ద్వారా రెండు పంటలకు సాగునీరు అందించినట్టు వివరించారు. మేడిగడ్డ బ్యారేజ్‌ (Medigadda Barrage) లో ఒక పిల్లర్ కుంగిన అంశాన్ని కోణంగా మార్చి బీఆర్ఎస్‌పై బురద జల్లి, అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్‌ను ఎద్దేవా చేశారు.

“కేసీఆర్‌పై కోపంతో రైతులకు అన్యాయం చేయవద్దు” అని హరీష్ రావు సూచించారు. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుండటం దురదృష్టకరం అని, కాంగ్రెస్ ప్రభుత్వం “కళ్లులేని కబోదుల్లా” వ్యవహరిస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు వరప్రదాయని అని గుర్తించాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు.

భూముల అమ్మకంపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ భూముల అమ్మకానికి పన్నాగం వేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీలో భూములు అమ్మే ప్రసక్తే లేదని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) & మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇప్పుడు వేల కోట్ల విలువైన భూములను వేలం వేయడానికి సిద్ధమవుతున్నారని ధ్వజమెత్తారు.

“బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనలోనే తిరోగమనం బాట పట్టించింది” అని హరీష్ రావు సోషల్ మీడియా X వేదికగా మండిపడ్డారు.

“హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్‌” పేరుతో భూముల వేలం నిర్వహించేందుకు కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు పిలవడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడుతనంగా హరీష్ రావు అభివర్ణించారు. “బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే, ఒక్క ఇంచు భూమి కూడా అమ్మబోమని హామీ ఇస్తున్నాం” అని స్పష్టం చేశారు.