ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గాజా పట్టణం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఎక్కడ చూసినా పేలుళ్ల ధ్వంసం, శిథిలాలు.. అక్కడికక్కడే ఆకలితో అలమటిస్తున్న ప్రజలు కనిపిస్తున్నారు. తిండి, నీటి కోసం ఇళ్లను వదిలి శరణార్థ శిబిరాలపైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకలితో బాధపడుతున్న గాజా పౌరులకు మద్దతుగా ఐక్యరాజ్య సమితికి చెందిన అనుబంధ సంస్థలు మానవతా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. వీటికి ఇజ్రాయెల్ సైన్యం భద్రత కల్పిస్తోంది. అయితే ఆహారం కోసం వేలాది మంది ఈ కేంద్రాల వద్ద గుమికూడుతుండటంతో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. తాజాగా ఉత్తర గాజాలోని ఓ ఆహార పంపిణీ కేంద్రం వద్ద భారీగా జనాలు చేరిన సందర్భంలో, వారిని నియంత్రించేందుకు ఇజ్రాయెల్ సైన్యం కాల్పులకు దిగినట్టు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ఆరోపించింది. ఈ కాల్పుల్లో 80 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. మరో రెండు కేంద్రాల వద్ద కూడా 10 మందికిపైగా మృతి చెందినట్టు వివరించింది.
ఈ ఘటనలపై స్పందించిన ఐక్యరాజ్య సమితి అధికారులు, ఇటీవల గాజా సిటీలోకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం కింద 25 ట్రక్కుల ఆహారం, నిత్యావసరాలను పంపించామని తెలిపారు. ట్రక్కులు గాజాలో ప్రవేశించిన వెంటనే వందలాది మంది పౌరులు వాటిని చుట్టుముట్టారని వెల్లడించారు.దీనిపై వివరణ ఇచ్చిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్), ఆహార కేంద్రాల వద్ద ప్రజలు అధికంగా గుమిగూడటం వల్ల అక్కడ ఉన్న సిబ్బందికి ముప్పు ఏర్పడిందని పేర్కొంది. పరిస్థితిని అదుపులోకి తేనికి గాల్లోకి హెచ్చరిక కాల్పులు జరిపామని చెప్పింది.
ఈ దృశ్యాలు గాజా ప్రజల దయనీయ స్థితిని కళ్లకు కట్టినట్టు స్పష్టం చేస్తుండగా, మానవహక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Read More : అమెరికాలో ఒబామా అరెస్టు వీడియోపై వివాదం

One thought on “ఆహార కేంద్రాల వద్ద కాల్పులు, 80 మంది మృతి”
Comments are closed.