ఎంపురాన్ నిర్మాతపై ఈడీ దాడులు – సినిమా వివాదమే కారణమా?

Empuraan Movie ED Raids

మాలీవుడ్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఎంపురాన్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రాన్ని నిర్మించిన గోకులం గోపాలన్‌కు చెందిన చిట్‌ ఫండ్‌ కార్యాలయాలపై ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు నిర్వహించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేరళతో పాటు చెన్నై కోడంబాక్కంలోని గోకులం చిట్‌ ఫండ్‌ కార్యాలయాల్లో ఈ దాడులు జరిగాయి. గోకులం చిట్‌ ఫండ్‌ సంస్థపై ఇప్పటికే ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఉన్నాయి. 2017లో ఆదాయపు పన్నుశాఖ చేసిన దాడుల్లో ఈ సంస్థ రూ. 1000 కోట్లకుపైగా పన్ను ఎగవేశట్టు ఆరోపణలు వచ్చాయి. తాజాగా, విదేశీ మారక ద్రవ్యం నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘన కింద ఈడీ దర్యాప్తు చేపట్టింది.

ఈడీ దాడుల వెనుక మరో కోణం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎంపురాన్ చిత్రంలో 2002లో గుజరాత్‌లో జరిగిన గోద్రా అల్లర్లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, అవి అభ్యంతరకరంగా మారినందున వివాదం చెలరేగిందని చెప్పుకుంటున్నారు. సినిమా విడుదలైన తర్వాత, కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతో, చిత్ర నిర్మాతలు సెన్సార్‌ బోర్డును సంప్రదించగా, కొన్ని మార్పులు చేసి ట్రిమ్‌ వెర్షన్‌ విడుదల చేశారు. అయితే, వివాదం ఆగకపోవడంతో ఈ అంశం రాజ్యసభలో కూడా ప్రస్తావనకు వచ్చింది.

ఈ నేపథ్యంలో, ఇప్పుడు ఈడీ దాడులు జరగడంతో, కేంద్రం ప్రతీకార చర్యగా దీనిని చేపట్టిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, మాలీవుడ్ నటుడు, కేంద్ర మంత్రి సురేష్‌ గోపి ఈ విషయంపై ఘాటుగా స్పందించడం, దాడుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఈడీ అధికారులు కీలకమైన పత్రాలు, డిజిటల్‌ రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మళ్లీ ఎంపురాన్ సినిమా వివాదం రాజుకున్న వేళ, ఈడీ దాడులు మరిన్ని అనుమానాలకు తావిస్తుండటం గమనార్హం. ఈ దర్యాప్తు చివరకు ఎటువైపు వెళ్లనుందో వేచి చూడాలి.

Read More

One thought on “ఎంపురాన్ నిర్మాతపై ఈడీ దాడులు – సినిమా వివాదమే కారణమా?

Comments are closed.