వర్మ స్పిరిట్ సినిమాలో నటించనున్నాడా? క్లారిటీ ఇచ్చిన వర్మ

Ram Gopal Varma Spirit movie role

ఇటీవల రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగ పాల్గొన్న ఒక కార్యక్రమంలో వర్మ, సందీప్‌ దర్శకత్వ ప్రతిభను ప్రశంసించాడు. ఆయన ఫిల్మ్ మేకింగ్‌ పట్ల అభినందనలు తెలుపుతూ, అవసరమైతే నటించడానికి రెడీ అని చెప్పిన నేపథ్యంలో, వర్మ స్పిరిట్ సినిమాలో గెస్ట్‌ రోల్ చేస్తున్నారనే వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రభాస్ హీరోగా సందీప్‌ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇంకా షూటింగ్‌ ప్రారంభం కాకపోయినా, వర్మ గెస్ట్‌గా కనిపించనున్నాడన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతకుముందు ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీలో వర్మ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్పందించిన వర్మ, “స్పిరిట్‌ సినిమాలో నేను నటించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. సందీప్‌ ఇప్పటివరకు నన్ను అడగలేదు. ఆ సినిమా గురించి నేను ఏమీ తెలియదు,” అంటూ క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు, స్పిరిట్ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో ఈ సినిమా ఆలస్యం అవుతోంది. అయితే, షూటింగ్ ప్రారంభమైన తర్వాత వర్మను సంప్రదించే అవకాశం ఉందా? అనే ఆసక్తి మాత్రం కొనసాగుతోంది.

ఇక కల్కి 2898 ఏడీ గెస్ట్‌ రోల్ గురించి మాట్లాడిన వర్మ, “ఆ సినిమా టీమ్‌లో నాకు తెలిసినవాళ్లు చాలామంది ఉన్నారు. వారి కోసం సరదాగా ఓ చిన్న పాత్ర చేశాను. ప్రేక్షకులు అలా నన్ను చూసి ఆశ్చర్యపోయి, ఆ పాత్రను ఆస్వాదించారు,” అన్నారు. గతంలో ఎన్నో సినిమాల్లో గెస్ట్‌ రోల్స్‌ చేసిన వర్మ, తన చిత్రాల్లోనూ అలాంటి పాత్రల్లో కనిపించాడు. ఇటీవల ఫిల్మ్ మేకింగ్ పట్ల సీరియస్‌గా లేని వర్మ, త్వరలోనే ఒక మంచి సినిమా తీస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. సందీప్ కూడా “వర్మ గారు సీరియస్‌గా సినిమా తీయాలి” అని చెప్పిన నేపథ్యంలో, వర్మ నుంచి మంచి ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

Read More



One thought on “వర్మ స్పిరిట్ సినిమాలో నటించనున్నాడా? క్లారిటీ ఇచ్చిన వర్మ

Comments are closed.