బెంగళూరు: కర్ణాటకలో ప్రస్తుత సీఎం సీట్ హాట్ సీట్ గా మారిందా? సీఎం మార్పు జరగనుందా ? అంటే ఎవరిదగ్గరా సరైన సమాధానం లేదు. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రాల సీఎంలు అయినా, ఎంత పెద్దవారైనా హైకమాండ్ చెప్పింది వినాల్సిందే. వారి మాటే శాసనం..లేదంటే కావాలి పార్టీకి దూరం. ఇప్పుడు సీఎం మార్పు విషయంపై రాజకీయం రోజురోజుకీ హీటెక్కుతోంది. ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రినని ఓవైపు సిద్ధరామయ్య నొక్కి చెబుతున్నా, అటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. తన చేతుల్లో ఏమీ లేదంటూనే ‘ఆశ పడటంలో తప్పులేదు కదా’ అనే సంకేతాలిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా డీకే చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. కుర్చీ దొరికితే వదలొద్దంటూ అధికార పీఠంపై తనకున్న ఆసక్తి గురించి ఆయన చెప్పకనే చెప్పారు.
బెంగళూరులో న్యాయవాదుల సంఘం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే మాట్లాడుతూ… ఇక్కడ చాలామంది లాయర్లు సీట్లు ఖాళీగా ఉన్నా అందులో కూర్చోవట్లేదు. కానీ, మేమందరం మాత్రం ఓ కుర్చీ కోసం తీవ్ర పోరాటాలు చేస్తుంటాం. కుర్చీని సంపాదించడం అంత ఈజీ కాదు. ఒకవేళ దొరికితే మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోవద్దు. అందులో కూర్చోవాలి. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని తన వాక్చాతుర్యంతో పారోక్షణ సీఎం సీటు గురించి వ్యాఖ్యలు చేశారు.
ఆయన వ్యాఖ్యలతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వులు చిందించారు. అయితే, ఇందులో డీకే చాలా తెలివిగా అధికారం అనే పదాన్ని ఎక్కడా ఉపయోగించనప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ఉద్దేశించే డీకే ఇలా మాట్లాడారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచే డీకే, సిద్ధరామయ్య ల మధ్య కుర్చీలాట మొదలైన సంగతి తెలిసిందే. అసలు డీకే నే సీఎం కుర్చీ వరిస్తుందని ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక చాలామంది భావించారు, కానీ ఆలా జరగలేదు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై హస్తం పార్టీ తీవ్ర కసరత్తు చేసింది. చివరకు సీనియార్టీ, ఇతరత్రా అంశాలను దృష్టిలో పెట్టుకొని సిద్ధరామయ్యను హైకమాండ్ ఎంచుకుంది. అయితే, రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని అప్పటినుంచే ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాన్నే నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బహిరంగంగానే దీనిపై వ్యాఖ్యలు చేశారు. దీనిపై డీకే, సిద్ధరామయ్య ఇద్దరూ స్పష్టతనిస్తూనే ఉన్నా.. రాజకీయం మాత్రం రసవత్తరంగా మారింది. అయితే, సిద్ధరామయ్యను గద్దె దించితే పార్టీ రెండుగా చీలిపోతుందని అధిష్టానం భయపడుతోంది. అందుకే.. ఆయనను కొనసాగించేందుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
Read More : అహ్మదాబాద్ ప్రమాదంపై తక్షణ నిర్ణయం వద్దు: రామ్మోహన్

One thought on “సీఎం కుర్చీపై డీకే మనసులో మాట”
Comments are closed.