ద్రౌపది ముర్ము పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలో పాల్గొనాలి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం వాటికన్ సిటీకి బయలుదేరి వెళ్లారు. ఆమెతోపాటు, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జాషువా డిసౌజా తదితరులు భారత ప్రతినిధి బృందం‌లో వాటికన్ పయనమయ్యారు.

ఏప్రిల్ 21న పోప్ ఫ్రాన్సిస్ (88) మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఏప్రిల్ 26న వాటికన్‌లో జరగనున్నాయి. ఈ సందర్భంగా, రాష్ట్రపతి ముర్ము వాటికన్‌లో ఏప్రిల్ 25, 26 తేదీల్లో పర్యటించనున్నారు. భారత ప్రభుత్వం, ప్రజల తరఫున పోప్‌కు నివాళులర్పించి, సంతాపం తెలియజేయనున్నట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఏప్రిల్ 25న, సెయింట్ పీటర్స్ బాసిలికా వద్ద, రాష్ట్రపతి పుష్పాంజలి ఘటిస్తారు. ఏప్రిల్ 26న, సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగే అంత్యక్రియల ప్రార్థనలకు కూడా ఆమె హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ యువరాజు విలియం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సహా పలు దేశాల అధినేతలు, రాజులు, ప్రముఖులు హాజరుకానున్నట్లు వాటికన్ వర్గాలు తెలిపాయి. సుమారు 130 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా.

పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కరుణ, వినయం, ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీక అని కొనియాడారు. పేదలు, అణగారిన వర్గాల కోసం పోప్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఏప్రిల్ 26న భారత్‌లో సంతాప దినం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు జాతీయ పతాకం అవనతం చేయబడుతుంది. ఆ రోజు అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవని ప్రకటించారు.

Read More : CHILDRENS : బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయటానికి RBI గ్రీన్ సిగ్నల్!

2 thoughts on “ద్రౌపది ముర్ము పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలో పాల్గొనాలి

Comments are closed.