బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ వివాహం..?

పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత దిలీప్ ఘోష్ (60) జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. శుక్రవారం ఆయన పార్టీ సహచరురాలు, నేత రింకూ మజుందార్ (51)ను వివాహం చేసుకున్నారు. కోల్‌కతా సమీపంలోని తన నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వైదిక సంప్రదాయబద్ధంగా ఈ పెళ్లి వేడుక నిర్వహించారు.

దిలీప్ ఘోష్ — రింకూ మజుందార్‌ల పరిచయం 2021లో ఎకో పార్క్‌లో ఉదయం వాకింగ్ సమయంలో మొదలైంది. ఇటీవల జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఈ బంధాన్ని అధికారికంగా ముద్రించుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. పెళ్లి ప్రస్తావనను తానే ముందుగా తీసుకువచ్చానని, దిలీప్ ఘోష్ వెంటనే అంగీకరించారని రింకూ మజుందార్ తెలిపారు.

వివాహానంతరం దంపతులు సంప్రదాయ బెంగాలీ దుస్తుల్లో మీడియాతో ముఖాముఖి అయ్యారు. తల్లి కోరికను నెరవేర్చడానికే ఈ వయస్సులో వివాహం చేసుకున్నట్లు దిలీప్ ఘోష్ వెల్లడించారు. తన వ్యక్తిగత జీవితం రాజకీయాలకు ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టంచేశారు. శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు అన్ని పార్టీల నేతలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

దిలీప్ ఘోష్‌కు ఇది మొదటి వివాహం కాగా, రింకూ మజుందార్ గతంలో ఓసారి పెళ్లి చేసుకుని కుమారుడికి తల్లిగా ఉన్నారు. ఈ వివాహ వేడుకకు బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందజేశారు. ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యేకంగా రెండు బొకేలు పంపించి శుభాకాంక్షల లేఖను పంపినట్లు సమాచారం.