DCM సూచనలపై నిర్మాత దిల్ రాజు స్పందన

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, థియేటర్లకు ప్రేక్షకులను మళ్లీ ఆకర్షించేందుకు పవన్ కళ్యాణ్ చేసిన సూచనలను ఆయన స్వాగతించారు.

పవన్ కళ్యాణ్‌ అభిప్రాయాలకు పూర్తి మద్దతు ప్రకటించిన దిల్ రాజు, “సగటు ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వచ్చేందుకు అవసరమైన మార్గాలు అన్వేషించడం పవన్ గారి ఆలోచనల్లో భాగం. ఆయన చెప్పిన దిశలో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను” అని తెలిపారు.

ఇందులో భాగంగా థియేటర్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్న పవన్ కళ్యాణ్ అభిప్రాయం కూడా ప్రశంసనీయమని దిల్ రాజు అన్నారు. “ఈ దిశలో మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కు సినిమాలు వేగంగా విడుదలవడంపై కూడా దిల్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. “ఓటీటీలకు విడుదలకు గడువు ఎంత ఉండాలో అన్న దానిపై పరిశ్రమగా ఒక నిర్ణయానికి రావాలి. ఇది ప్రేక్షకులను థియేటర్లకు మళ్లీ రప్పించేందుకు కీలకం” అని అన్నారు.

ప్రభుత్వంతో సంప్రదింపుల విషయంలో ఫిలిం ఛాంబర్ ద్వారానే ముందుకు సాగాలన్న పవన్ కళ్యాణ్ సూచనను కూడా దిల్ రాజు సమర్థించారు. “ఇది పరిశ్రమకు శాశ్వతమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. అందుకే అందరం కలిసికట్టుగా ప్రభుత్వం సహకారంతో ముందుకు సాగాలి” అని స్పష్టం చేశారు.

పైరసీ వల్ల థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గిందని గుర్తు చేసిన దిల్ రాజు, “పైరసీపై సంయుక్తంగా పోరాడితేనే మనం పరిశ్రమను కాపాడగలము. ప్రభుత్వాల సహకారంతో ఈ సమస్యను నివారించాలి” అని తెలిపారు.

చివరిగా, ఏపీ ప్రభుత్వ సూచనలు తెలంగాణ ప్రభుత్వంతోనూ చర్చించి, రెండు రాష్ట్రాల్లో కూడా సమన్వయం చేసుకుంటామని దిల్ రాజు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ మొదటి అడుగుగా పరిశ్రమకు మార్గం చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Read More : హార్డ్‌డిస్క్ మిస్ కావడంతో ఎమోషనల్ ట్వీట్

One thought on “DCM సూచనలపై నిర్మాత దిల్ రాజు స్పందన

Comments are closed.