ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ గొలుసు లాక్కెళ్లిన దొంగ పట్టుబాటు

దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ మహిళా ఎంపీ ఆర్. సుధ గొలుసు లాక్కెళ్లిన ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ దొంగతనానికి పాల్పడిన పాత నేరస్థుడు సోహన్ రావత్ (24)ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి చోరీకి గురైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఆర్. సుధ సోమవారం ఉదయం 6:15 గంటల సమయంలో తోటి ఎంపీ రాజాతో కలిసి ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తున్నారు. చెక్ రిపబ్లిక్ రాయబార కార్యాలయం సమీపానికి రాగానే, ఫుల్ ఫేస్ హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి స్కూటర్‌పై వేగంగా వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ ఘటనలో ఆమె మెడకు గాయాలయ్యాయి. కేకలు వేయడంతో పాటు సహాయం కోరినా, సమీపంలో ఎవరూ స్పందించలేదు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన వీఐపీ జోన్‌లో పార్లమెంట్ సభ్యురాలికే రక్షణ లేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో ఈ కేసును సవాలుగా తీసుకున్న న్యూఢిల్లీ, సౌత్ ఢిల్లీ జిల్లాల పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. వందలాది సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, పాత నేరస్థుల కదలికలపై నిఘా పెట్టి నిందితుడిని గుర్తించారు.

పోలీసుల ప్రకారం సోహన్ రావత్ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. అతనిపై ఇప్పటికే 26 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు. అతని వద్ద నుంచి 30.9 గ్రాముల బంగారు గొలుసుతో పాటు నేరానికి ఉపయోగించిన స్కూటర్, హెల్మెట్, దుస్తులు మరియు చోరీ చేసిన కొన్ని మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఇతర చైన్ స్నాచింగ్ కేసుల్లో కూడా రావత్ ప్రమేయం ఉందా అనే దానిపై విచారణ కొనసాగుతోంది.

Read More : ఢిల్లీలో ఎంపీ సుధా రామకృష్ణన్‌కు చేదు అనుభవం

One thought on “ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ గొలుసు లాక్కెళ్లిన దొంగ పట్టుబాటు

Comments are closed.