ఇండిగో విమాన ప్రయాణంలో దాదాపు మృత్యుయాత్ర.

ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో బుధవారం ప్రయాణించిన వారందరికీ ఒక్కసారిగా భయానక అనుభవం ఎదురైంది. మార్గమధ్యంలో తీవ్ర వాతావరణ మార్పులు చోటుచేసుకోవడంతో విమానం గాలిలో తీవ్రమైన కుదుపులకు లోనైంది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతల బృందం కూడా ప్రయాణిస్తోంది.

వడగళ్ల వాన కారణంగా విమానం ఒక్కసారిగా అదుపుతప్పినట్లయింది. విమానంలోని కుదుపుల తీవ్రతతో పైలట్ శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు అత్యవసర స్థితి ప్రకటించి, వెంటనే విమానాన్ని ల్యాండ్ చేశారు. విమానంలో టీఎంసీ నాయకులు డెరెక్ ఓబ్రెయిన్, నదీముల్ హక్, సాగరిక ఘోష్, మానస్ భునియా, మమతా ఠాకూర్‌లు ఉన్నారు.

ఈ దృశ్యాల గురించి టీఎంసీ నాయకురాలు సాగరిక ఘోష్ మాట్లాడుతూ, “నిజంగా మృత్యువు అంచుల దాకా వెళ్లిన అనుభవం. జీవితాంతం మర్చిపోలేను. ప్రయాణికులంతా భయంతో కేకలు వేస్తూ దేవుడిని ప్రార్థించారు. అలాంటి క్లిష్ట సమయాల్లో మమ్మల్ని సురక్షితంగా తీసుకెళ్లిన పైలట్‌కు మా ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

ల్యాండింగ్ తర్వాత విమానం ముందు భాగం దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. విమానంలో 200 మంది ప్రయాణికులు ఉన్నా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కుదుపులకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో ప్రయాణికులు భయంతో కదిలిపోతూ ప్రార్థనలు చేస్తుండటం కనిపిస్తోంది.

ఇదే విమానంలో ఉన్న టీఎంసీ ప్రతినిధి బృందం జమ్మూ కశ్మీర్‌లో మే 23 వరకు పర్యటించనుంది. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో పూంఛ్, రాజౌరీ ప్రాంతాల్లో పర్యటన చేపట్టనున్నారు.

ఈ ఘటనపై ఇండిగో సంస్థ స్పందిస్తూ ప్రకటన విడుదల చేసింది. “విమాన సిబ్బంది ఎలాంటి ఆందోళనకర పరిస్థితి తలెత్తకుండా నిబంధనల ప్రకారం ప్రయాణాన్ని నిర్వహించారు. విమానం దిగిన తర్వాత ప్రయాణికుల సంక్షేమం కోసం మేము అవసరమైన అన్ని చర్యలు చేపట్టాం. తనిఖీలు పూర్తయిన తర్వాత విమానం మళ్లీ సేవల కోసం సిద్ధం చేస్తాం” అని వెల్లడించింది.

Read More : ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

One thought on “ఇండిగో విమాన ప్రయాణంలో దాదాపు మృత్యుయాత్ర.

Comments are closed.