ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రం ఏదైనా ఉందంటే, అది ‘కోర్ట్’ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించారు. స్టార్ క్యాస్టింగ్ లేకుండా, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా గత నెల 14న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పది కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, థియేటర్లలోనే 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
థియేటర్లలో ఈ సినిమాను చూసినవాళ్లతో పాటు, మిస్సయినవారు లేదా మరోసారి చూడాలనుకునేవారు ఓటీటీ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ వేచిచూపులకు ముగింపు పడింది. ఈ నెల 11న ‘కోర్ట్’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే డిజిటల్ రిలీజ్ తేదీ ప్రకటించడం వలన, మళ్లీ ప్రేక్షకులు దీనిని ఆసక్తిగా వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ చిత్ర కథా నేపథ్యం సమకాలీనంగా, భావోద్వేగాలతో నిండినదిగా ఉంటుంది. టీనేజీలో ఉన్న ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడటం, తర్వాత అమ్మాయి మేనమామ ఆ కుర్రాడిని పోలీసులకు పట్టించి, పాక్సో సహా అనేక కేసులు మోపడం… దీంతో అతను పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుపోతాడు.
ఈ తరుణంలో ఒక యువ లాయర్ తన మొదటి కేసుగా దీనిని తీసుకుని, సమర్థవంతమైన వాదనలతో ఆ యువకుడిని తప్పించటం — ఇదే కథలోని ముఖ్యమైన మలుపు. సామాజిక సందేశంతో పాటు భావోద్వేగాలతో నిండిన కథనం ‘కోర్ట్’ చిత్రాన్ని హృదయాలకి చేరువ చేసింది.

One thought on “చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని కొల్లగొట్టిన ‘కోర్ట్’.. ఓటీటీకి డేట్ ఫిక్స్!”
Comments are closed.