సింగపూర్‌లో అగ్నిప్రమాదం.. పవన్ కుమారుడు ఆసుపత్రిలో చికిత్స

Pawan Kalyan's son injured in fire accident

పవర్ స్టార్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న పాఠశాలలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అతని చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అంతేకాకుండా, గాఢమైన పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన కారణంగా శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ప్రస్తుతం మార్క్ శంకర్‌కు సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ తన విశాఖపట్నం పర్యటనను తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రస్తుతం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు ఏజెన్సీలో పర్యటిస్తున్నారు. అరకు సమీపంలోని కురిడి గ్రామానికి ఇచ్చిన మాట మేరకు అక్కడి ప్రజలతో భేటీ అయ్యేందుకు ముందుగా వెళ్లాలని నిర్ణయించారు. “వారితో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకోవాలి. అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి సన్నాహాలు పూర్తి చేసి వెళ్తాను” అని పవన్ తెలిపారు.

అరకు పర్యటన పూర్తయిన అనంతరం పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకుని అక్కడి నుండి సింగపూర్‌కు బయలుదేరనున్నారు. కుమారుని ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం సమీక్షిస్తున్న పవన్, కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నారు. మార్క్ శంకర్ పరిస్థితి పై మరింత సమాచారం అధికారులు, వైద్యుల నుండి తెలుసుకున్న తరువాత, అవసరమైతే పవన్ మరింత కాలం సింగపూర్‌లో ఉండే అవకాశం ఉంది.

Read More