భక్తులకు అప్రమత్తత సూచన
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని నడక మార్గంలో అడవి జంతువుల కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు వెలువడుతున్నాయి. తాజా సంఘటనలో, తిరుమల నడక మార్గంలో ఏడో మైలు వద్ద, మొదటి ఘాట్ రోడ్డు కలిసే ప్రాంతానికి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఏనుగులు సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించి, టీటీడీ విజిలెన్స్ విభాగం మరియు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమై, భక్తులకు ఎటువంటి అవాంతరాలు కలగకుండా, ఏనుగులను మళ్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ శాఖ అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి, గజరాజులను తిరిగి అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఇటీవల కాలంలో తిరుమల నడక మార్గం, ఘాట్ రోడ్ల పరిసర ప్రాంతాల్లో అడవి జంతువుల కదలికలు పెరుగుతుండటంతో భక్తులకు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజిలెన్స్ విభాగం సూచించింది. ఎవరైనా నడక మార్గంలో ఏనుగులు లేదా ఇతర అడవి జంతువులు కనిపించినట్లయితే, వెంటనే అధికారులకు సమాచారం అందించాలని విజిలెన్స్ అధికారులు కోరారు.

One thought on “తిరుమల నడక మార్గంలో ఏనుగుల సంచారం”
Comments are closed.