ఫ్లైట్‌లో ప్రత్యేకంగా సెలబ్రేషన్!

మెగాస్టార్ చిరంజీవి తన వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో సరళంగా, కానీ ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ ప్రత్యేక రోజును తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్న ఆయన, విమాన ప్రయాణంలోనే సెలబ్రేట్ చేసుకున్నారు. దుబాయ్ వెళ్లే ఫ్లైట్‌లో తమ పెళ్లి రోజును ఆనందంగా గడిపారని చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ వేడుకలో అక్కినేని నాగార్జున, అమల దంపతులు కూడా పాల్గొనడం విశేషం. చిరంజీవి ఈ ప్రత్యేక క్షణాలను అభిమానులతో పంచుకోవడంతో, ఆయన షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు ఆయన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ట్విట్టర్‌లో చిరంజీవి తన ఆనందాన్ని పంచుకుంటూ – “మా వివాహ వార్షికోత్సవాన్ని ప్రియమైన స్నేహితులతో కలిసి విమాన ప్రయాణంలో జరుపుకోవడం నిజంగా ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. జీవితంలో సురేఖ లాంటి అద్భుతమైన జీవిత భాగస్వామిని పొందడం నా అదృష్టం. ఆమె నా బలం, నా స్థిరత్వానికి కారణం. ప్రపంచాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడంలో, జీవిత ప్రయాణాన్ని మరింత సాఫీగా సాగించడంలో ఆమె నాకు అండగా నిలుస్తోంది. ఆమె పక్కన ఉంటే నాలో ఒక కొత్త ఉత్సాహం, ప్రేరణ కలుగుతుంది. నా జీవితంలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సందర్భంగా నా సోల్‌మెట్‌ సురేఖకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే, మా పెళ్లి రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన నా కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని భావోద్వేగంగా రాశారు.

Read More