అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్షలో హైటెక్ కాపీయింగ్ ముఠా కలకలం రేపింది. దేశం తూర్పు చివర్లోని ఇటానగర్ పట్టణంలో అభ్యర్థులు పరీక్ష రాస్తుంటే, 2,600 కిలోమీటర్ల దూరంలోని హర్యానా రాష్ట్రం నుంచి సమాధానాలను పంపుతున్న ముఠా గుట్టు రట్టయింది.
నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 18న సీబీఎస్ఈ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. ఇటానగర్‌లోని వీకేవీ చింపూ, కింగ్‌కప్ పబ్లిక్ స్కూల్లను పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించారు.
వైరలైన హైటెక్ మోసం: 53 మంది అభ్యర్థులు అరెస్ట్
ల్యాబ్ అటెండెంట్ పరీక్ష సందర్భంగా కింగ్‌కప్ స్కూల్లో ఓ అభ్యర్థి అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తనిఖీ చేయగా అతని వద్ద చిన్న ఎలక్ట్రానిక్ పరికరం, సూక్ష్మ ఇయర్‌పీస్ లభ్యమయ్యాయి.
దీంతో అక్కడ పరీక్ష రాస్తున్న మిగతా అభ్యర్థులను తనిఖీ చేయగా, 23 మంది వద్ద అలాంటి పరికరాలు కనిపించాయి. పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వివేకానంద కేంద్ర విద్యాలయం కేంద్రంలోనూ తనిఖీలు నిర్వహించి మొత్తం రెండు కేంద్రాల్లో 53 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 29 ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
పరీక్షల నిర్వహణలో భద్రతా లోపాలను ఉపయోగించుకుంటూ, మారుమూల ప్రాంతాలను ఎంచుకుని పరీక్ష కేంద్రాలుగా సెట్ చేయాలని అభ్యర్థులకు ముఠా సూచించినట్టు పోలీసులు తెలిపారు. పరీక్షల ముందు జీఎస్ఎం ఆధారిత పరికరాలు అందించి, వాటిని ఎలా వాడాలో శిక్షణ ఇచ్చారని వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఉన్నత స్థాయి ముఠా పాత్రపై విచారణ కొనసాగుతోంది.
Read More : అమృత్ భారత్ పథకంతో రైల్వే స్టేషన్లు ప్రారంభం.

2 thoughts on “అరుణాచల్ ప్రదేశ్‌లో హైటెక్ కాపీయింగ్ ముఠా హల్చల్…”
Comments are closed.