ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో కీలక భేటీలు నిర్వహించారు. నాలెడ్జ్ ఎకానమీలో ఏపీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారని పేర్కొంటూ, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్‌మిషన్ కారిడార్లు, పోర్టులు వంటి రంగాల్లో సింగపూర్ కంపెనీల భాగస్వామ్యం అవసరమని సూచించారు. సోమవారం సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్‌తో సీఎం చంద్రబాబు సమావేశమై, గత జగన్ ప్రభుత్వ కాలంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులపై చర్చించారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు రికార్డులు సరిచేయడమే ఈ పర్యటన ఉద్దేశమని తెలిపారు. నవంబర్‌లో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని టాన్ సీ లాంగ్‌ను ఆహ్వానించారు. సింగపూర్‌లోని బిడదారి ఎస్టేట్‌లో సీఎం బృందం రెండు గంటల పాటు పర్యటించింది. 10 వేల కుటుంబాలు నివసించేలా రూపొందించిన ఈ పర్యావరణ హిత హౌసింగ్ ప్రాజెక్ట్ ప్రత్యేకతలను సింగపూర్ అధికారులు వివరించారు. చెట్లను తొలగించకుండా, సహజ నీటి వనరులను కాపాడుతూ నిర్మాణం చేపట్టిన విధానాన్ని ప్రశంసించిన సీఎం, ఈ విధానాలను అమరావతి అభివృద్ధిలో అనుసరించనున్నట్లు తెలిపారు.
అనంతరం హౌసింగ్ డెవలప్‌మెంట్ బోర్డు, అర్బన్ రీడెవలప్‌మెంట్ అథారిటీ, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్‌ప్రైజ్‌తో పాటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. అమరావతి నిర్మాణానికి సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందనీ, వరల్డ్ బ్యాంక్ భాగస్వామ్యంతో అమరావతిని ఆధునిక సదుపాయాలతో కూడిన మోడల్ నగరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
“గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దడానికే ఈ పర్యటన. ఏపీ అభివృద్ధి ప్రాజెక్టుల్లో, ముఖ్యంగా అమరావతి మరియు అర్బన్ హౌసింగ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం కీలకమవుతుంది” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Read More : ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దేవానంద్
