బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలకు వరంగల్ వేదిక.. భారీ ఎత్తున ఏర్పాట్లు..

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతి పెద్ద పార్టీగా బీఆర్ఎస్ కొనసాగుతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ 25 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జుబ్లీ వేడుకలు వరంగల్‌లో నిర్వహించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.ఈ మేరకు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు తక్కువ సమయంలోనే పూర్తి చేస్తున్నామని తెలిపారు.

భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
వరంగల్ జిల్లా ఎల్కతుర్తి ప్రాంతంలో సుమారు 1,200 ఎకరాల్లో బహిరంగ సభ కోసం వేదికను సిద్ధం చేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న ఆయన, ప్రజల రాకపోకల కోసం 3,000 బస్సులు అందించాలని ఆర్టీసీని కోరామన్నారు. దీనికి ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించిందని వెల్లడించారు.

సభ తర్వాత డిజిటల్ సభ్యత్వ నమోదు
బహిరంగ సభ అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈసారి సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహించనున్నామని, సభ్యత్వాల తర్వాత పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా కమిటీలను తిరిగి ఏర్పాటు చేసి, కార్యకర్తలకు శిక్షణ సమావేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు. వచ్చే 12 నెలల్లో ప్రతి నెలా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

ప్రభుత్వ అనుమతి లేకపోతే కోర్టు ద్వారా సభ
బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతినివ్వకపోతే, కోర్టు ద్వారా అనుమతి తీసుకుని సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, మాజీ సీఎం కేసీఆర్‌పై కేసులు పెట్టే కుట్రల్లోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని విమర్శించారు.

విద్యార్థుల ఉద్యమాలకు మద్దతు
లగచర్లలో రైతులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను గుర్తు చేసిన కేటీఆర్, విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తేస్తామని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. హెచ్‌సీయూ భూముల్లో జరిపిన నిర్మాణాల వల్ల జంతువులు రోడ్లపైకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Read More : కేంద్రం lpg సిలిండర్ ధర పెంపుపై కేటీఆర్ మండిపాటు..