రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ (Borugadda Anil) పై హైకోర్టు (AP High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద బోరుగడ్డపై చర్యలు తీసుకోవాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. కోర్టు నిర్దేశించిన సమయంలో జైలు అధికారుల ఎదుట హాజరుకాలేదని, దీనిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు బోరుగడ్డను ఆదేశించింది.
అదేవిధంగా, తప్పుడు ధృవపత్రాలు సమర్పించి మధ్యంతర బెయిల్ పొందిన విషయంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది.
తప్పుడు ధృవపత్రాలపై విచారణ
గతంలో తన తల్లికి హార్ట్ సర్జరీ చేయించాల్సి ఉందని, ఆమె చెన్నైలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పేర్కొంటూ బోరుగడ్డ అనిల్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై హైకోర్టు అతడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ పొందేందుకు గుంటూరుకు చెందిన ఓ డాక్టర్ ఇచ్చిన మెడికల్ రిపోర్టును కోర్టుకు సమర్పించాడు. పోలీసులు దాని నిజాసత్యాలపై విచారణ జరిపితే, అది ఫేక్ డాక్యుమెంట్‌గా తేలింది.
ఈ నేపథ్యంలో, పోలీసులు బోరుగడ్డను వెంటనే లొంగిపోవాలని, జైలు వద్దకు రావాలని సూచించారు. అయితే, అనిల్ ఆలస్యంగా హాజరయ్యాడు. దీనిపై పోలీసులు ప్రశ్నించగా, అతడు వేర్వేరు కారణాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
కోర్టు కీలక ఆదేశాలు
పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందిస్తూ, నిర్దేశిత సమయంలో ఎందుకు హాజరుకాలేదో బోరుగడ్డ అనిల్ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, తప్పుడు ధృవపత్రాల సహాయంతో బెయిల్ పొందిన విషయం పై పూర్తి స్థాయి విచారణ జరిపి, నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.
ఈ కేసుపై తదుపరి విచారణ వారం రోజుల పాటు వాయిదా పడింది.
