గూగుల్‌లో హత్య మార్గాలు సెర్చ్ చేసినట్లు పోలీసుల వెల్లడి

బెంగళూరులో జరిగిన ఓ దారుణ హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో నివసిస్తున్న ఓం ప్రకాశ్ ఆదివారం రాత్రి నిద్రలో ఉన్న సమయంలో దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో ఆయన భార్య పల్లవి (64)ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి, 14 రోజుల న్యాయ హిరాసతుకు తరలించారు.

పల్లవి మొబైల్‌ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులకు షాక్ తగిలింది. హత్యకు ముందే ఇంటర్నెట్‌లో “మెడ వద్ద నరాలు, రక్తనాళాలు కోయడం ద్వారా వ్యక్తిని ఎలా చంపవచ్చో” వివరంగా గూగుల్‌లో అన్వేషించినట్లు సెర్చ్ హిస్టరీలో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గత ఐదు రోజులుగా ఆమె ఇదే విషయంపై శోధన చేస్తూ ఉండడం గమనార్హం.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, హత్యకు ముందు ఓం ప్రకాశ్ ముఖంపై కారం చల్లిన పల్లవి, ఆ తర్వాత కత్తితో పలు మార్లు పొడిచి హత్య చేసినట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా, పల్లవి కొంతకాలంగా స్కిజోఫ్రెనియా వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.

అయితే, తన భర్త నుంచి గృహ హింసకు గురయ్యానని, అదే కారణంగా ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు పల్లవి విచారణలో ఆరోపించారు. కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో మీడియా ప్రశ్నించగా, ‘గృహ హింస’ అనే మాటను పలు మార్లు పునరావృతం చేశారు.

ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read More : కర్ణాటకలో పదో తరగతి పరీక్షల్లో అవినీతి ప్రదర్శన..