భారత్-ఇంగ్లండ్ ల మధ్య ఐదు టెస్టులలో భాగంగా రేపటి నుంచి (జూలై 31) 5వ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా రేపు టీమిండియాతో ప్రారంభం కాబోయే ఐదో టెస్ట్ కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, ఇన్ ఫామ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ భుజం గాయం కారణంగా కీలకమైన మ్యాచ్ కు దూరమయ్యాడు.
స్టోక్స్ మాంచెస్టర్లో జరిగిన నాలుగో టెస్ట్ లో ఏకంగా 35 ఓవర్లు వేసి గాయాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు వీరోచితంగా పోరాడుతున్న సమయంలోనే స్టోక్స్ చాలా అసౌకర్యంగా కనిపించాడు. అప్పుడే అతని పని అయిపోయిందని అంతా అనుకున్నారు. నాలుగో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు ఐదుకు పైగా సెషన్లలో ఏకంగా 143 ఓవర్లు బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ బౌలర్ల రసాన్ని పీల్చారు. స్టోక్స్ దాని బాధితుడే అని చెప్పొచ్చు. ఆ మ్యాచ్ లో స్టోక్స్ బంతితో పాటు బ్యాట్ తోనూ చెలరేగి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
అంతకుముందు వారు గెలిచిన మూడో టెస్ట్ లోనూ స్టోక్సే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఆ మ్యాచ్ లో అతను 77 పరుగులు చేసి, 5 వికెట్లు తీశాడు. ఈ సిరీస్ లో లీడింగ్ వికెట్ టేకర్ గా (17 వికెట్లు) నిలవడంతో పాటు బ్యాట్ తోనూ మంచి టచ్ లో ఉన్న స్టోక్స్ కీలకమైన ఐదో టెస్ట్ కు దూరం కావడం ఇంగ్లండ్ విజయావకాశాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది.
ఇంగ్లండ్ జట్టులో జరిగిన మార్పులు…
స్టోక్స్ గైర్హాజరీలో ఐదో టెస్ట్ లో ఇంగ్లండ్ కెప్టెన్ గా ఓలీ పోప్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తుది జట్టును కూడా ప్రకటించింది. ఇందులో ఏకంగా నాలుగు మార్పులు చేసింది. గాయపడిన స్టోక్స్ స్థానంలో జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి రాగా.. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బేతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్లకు తుది జట్టులో స్థానం కల్పించింది. జేకబ్ బేతెల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడని స్పష్టం చేసింది.
కాగా, ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో భారత్ ప్రస్తుతం 1-2తో వెనుకపడి ఉంది. ఇందులో 1,3 మ్యాచ్ లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్ లో విజయం సాధించింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఐదో టెస్ట్ లో భారత్ విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండ్ వశమవుతుంది. ఇలాంటి కీలక మ్యాచ్ లో ఇన్ ఫామ్ ఆల్ రౌండర్ స్టోక్స్ లేకపోవడం భారత్ కు తప్పక కలిసొచ్చే విషయమే. స్టోక్స్ తో పాటు ఇంగ్లండ్ జట్టులో జరిగిన మార్పులను టీమిండియా ఏ మేర ఉపయోగించుకుంటుందో ఏమో మరి.

One thought on “టీమిండియాతో ఐదో టెస్టుకు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్!”
Comments are closed.