తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశంసించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలోని ఐటీడీఏ పరిధిలో సోమవారం ఈ పథకాన్ని సీఎం అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి భావోద్వేగంగా మాట్లాడారు.
రేవంత్ రెడ్డి ఓ వజ్రం లాంటి నాయకుడని, ఈ పథకం ఆయన మనసులోని శుద్ధ ఆలోచనల ఫలమని భట్టి అన్నారు. జల, జంగల్, జమీన్ కోసం గిరిజనులు చేసిన పోరాటాలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ పథకం ద్వారా గిరిజనులు భూమిని సాదించుకోవడమే కాదు, సాగు చేయగలిగే అవకాశాలు కూడా కలుగుతాయని పేర్కొన్నారు.
నల్లమల డిక్లరేషన్‌ను గుర్తు చేసిన భట్టి, అటవీ సంపదపై గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. భూమిని మాత్రమే కాకుండా, సాగుకు అవసరమైన నిధులు, వనరులు అందించడం ద్వారా గిరిజన కుటుంబాల అభివృద్ధికి ఇది మార్గదర్శకమవుతుందని చెప్పారు.
ప్రభుత్వంపై జరుగుతున్న విమర్శలు రాజకీయ కుట్రలేనని తేల్చిచెప్పిన భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రజల సంక్షేమమేనని, అందుకే ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని తెలిపారు. “సంపదను సృష్టిస్తాం.. దానిని పేదలతో పంచుకుంటాం.. ఇదే మా నినాదం,” అని ఆయన స్పష్టం చేశారు.
Read More : రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు.

One thought on “ఇందిర సౌర గిరి జల వికాసం పథకం గొప్ప ఆలోచన.”
Comments are closed.