సైబర్ మోసం నుంచి తెలుగు యువతిని కాపాడిన : BJP నాయకుడు

బ్యాంకాక్‌లో ఉద్యోగాల పేరుతో మోసపోయి మయన్మార్‌లో సైబర్ మోసాల ఉచ్చులో చిక్కుకున్న తెలుగు యువకులను కేంద్ర మంత్రి బండి సంజయ్ సురక్షితంగా స్వదేశానికి రప్పించారు.కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలతో బండి సంజయ్ చొరవ చూపి వీరి రాకకు మార్గం చేశారు.

ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా కోహెడకు చెందిన రాకేష్ రెడ్డి, ఏ. శివశంకర్, కరీంనగర్‌కు చెందిన కానూరి గణేశ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆకుల గురు యువ కిశోర్‌లు ఇండియాకు తిరిగివచ్చారు.

వివరాల్లోకి వెళితే, బ్యాంకాక్‌లో ఉన్నత వేతన ఉద్యోగాల పేరుతో బ్రోకర్లు ఈ యువకులను మోసం చేశారు. కానీ అక్కడకు చేరుకున్న తర్వాత మయన్మార్‌కు తీసుకెళ్లి, రోజుకు 16 గంటలపాటు సైబర్ మోసాలకు బలవంతంగా పనిచేయించారు. ఎదురు పలికిన వారికి చిత్రహింసలు విధించినట్లు బాధితులు వెల్లడించారు.

ఈ విషయాన్ని బండి సంజయ్ దృష్టికి తీసుకురాగానే, విదేశాంగ శాఖతో సమన్వయం చేసి తక్షణమే చర్యలు చేపట్టారని, తనతో పాటు మరికొంతమంది బాధితులను సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చారని రాకేష్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, మయన్మార్‌లో ఇంకా వందలాది మంది భారతీయులు ఇలాంటి వేధింపులకు గురవుతున్నారని, వారిని కూడా స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసే బ్రోకర్ల వలలో పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.

Read More : తెలంగాణలో గద్దర్ చలనచిత్ర అవార్డులు జూన్ 14న భారీ స్థాయిలో జరగనున్న వేడుక