కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

BANDI SANJAY

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఏపీ-తెలంగాణ మధ్య నీటి వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తే, కొందరు విమర్శలు చేస్తుండటం దురదృష్టకరమని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను సమానంగా కాపాడుతామని తెలిపారు. ఈ సమస్యను జలవివాద పరిష్కార కమిటీ చూసుకుంటుందని పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్‌పై ఆరోపణలు

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఇప్పుడు అదే పంథాలో కాంగ్రెస్ కూడా వ్యవహరిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌తో జల్సాలు చేశారని ఆరోపించిన బండి, ‘‘ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?’’ అని ప్రశ్నించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్లపై ధ్వజమెత్తిన బండి

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఒకటిగా అభివర్ణించిన బండి సంజయ్, ప్రజల సమస్యలపై చర్చకు సిద్ధమా అని ప్రతిపక్షాలను సవాల్ విసిరారు. రాష్ట్రంలోని గ్రామీణ పరిస్థితి అధ్వానంగా మారిందని విమర్శించారు. సర్పంచులు, ఎంపీటీసీలే బీజేపీకి ప్రచారకర్తలని పేర్కొన్నారు.

బీసీలకు అన్యాయం జరుగుతోంది

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేసిన బండి సంజయ్, బీసీలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు కేటాయించడాన్ని తప్పుపట్టారు. జనాభా లెక్కల ఆధారంగా బీసీలకే పూర్తి 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రైల్వే అభివృద్ధిపై హామీ

కేంద్ర రైల్వే శాఖ మంత్రి రేపు తెలంగాణలో వ్యాగన్ ఫ్యాక్టరీ ప్రారంభించనున్నట్లు బండి సంజయ్ తెలిపారు. కేంద్రం అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Read More : ఖమ్మంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు: రేవంత్‌ ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారా?..