పాకిస్థాన్ బలూచిస్థాన్‌లో బీఎల్‌ఏ దాడి

పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి తీవ్ర దాడులు జరిగాయి. వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) రెండు వేర్వేరు దాడుల్లో 14 మంది పాకిస్థానీ సైనికులను హతమార్చింది. ఈ ఘటనలు బలూచిస్థాన్‌లో ఉధృతమైన తిరుగుబాటును, అక్కడి పరిస్థుతులను మరింత సంక్లిష్టత చేయడం స్పష్టమవుతున్నాయి.

బోలాన్ జిల్లాలోని మాచ్ ప్రాంతంలోని షోర్కాండ్ వద్ద బీఎల్‌ఏ స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ (ఎస్‌టీవోఎస్) పాకిస్థాన్ సైనిక కాన్వాయ్‌పై రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీ పేల్చింది. ఈ శక్తివంతమైన పేలుడు వాహనంలో ఉన్న సైనిక అధికారులు, స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిఖ్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫరూఖ్ తో సహా 12 మంది సైనికులు అక్కడికక్కడే మరణించారు. సైనిక వాహనం పూర్తిగా ధ్వంసమైంది.

ఆదివారం, కేచ్ జిల్లా కులగ్ టిగ్రాన్ ప్రాంతంలో బీఎల్‌ఏ మరో దాడి జరిపింది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సభ్యులపై ఈ దాడి జరిగింది, ఇందులో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ రెండు దాడులకు బాధ్యత వహిస్తున్నట్లు బీఎల్‌ఏ ప్రతినిధి జీయంద్ బలూచ్ ప్రకటించారు. పాకిస్థాన్ సైన్యం చైనా పెట్టుబడులకు, ఇతర విదేశీ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. తమ భూమిని ఆక్రమించిన పాకిస్థాన్ సైన్యంపై బలూచ్ స్వాతంత్ర్య సమరయోధులు మరింత తీవ్రతతో దాడులు చేస్తామని హెచ్చరించారు.

బలూచిస్థాన్ ప్రాంతం సహజ వనరులతో సమృద్ధిగా ఉన్నప్పటికీ, స్థానికులు పేదరికం, వివక్ష, ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని వేర్పాటువాద గ్రూపులు చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి. పాకిస్థాన్ ఈ ప్రాంతంలో బీఎల్‌ఏ వంటి సంస్థలకు ఆఫ్ఘనిస్థాన్ నుంచి మద్దతు లభిస్తున్నట్లు ఆరోపిస్తోంది. ఈ తాజా దాడులు బలూచిస్థాన్‌లో ఉద్రిక్తతలను మరింత పెంచాయి.

Read More : video : పాక్‌లోని గుల్పూర్ ఉగ్ర శిబిరంపై భారత సైన్యం దాడి..