పలు ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ (గురువారం) ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతిలోని తాడికొండ సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో సుమారు 25 నుంచి 30 అంశాలు చర్చకు వస్తాయి. ముఖ్యంగా అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తిస్తూ చట్టసభ ఆమోదం పొందడం, పలు సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష జరగనుంది.

అమరావతికి ప్రధాని మోదీ ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించనుంది. ఇటీవల జరిగిన 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా ఈ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉంది.

మరోవైపు పలు సంస్థలకు భూముల కేటాయింపు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా దేశ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో తీర ప్రాంత భద్రతపై ముఖ్యమంత్రి మంత్రులతో సమీక్షించనున్నారు. ఇటీవల విజయవంతంగా పూర్తి చేసిన ఆపరేషన్ సిందూరం పై భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు అభినందనలు తెలుపనున్నట్లు సమాచారం.

చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే రూ.10,000 నిబంధనను రూ.20,000కి పెంచే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది. ఈ నిధులను ఇప్పటికే ప్రభుత్వం పంపిణీ చేసింది.

రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం పలు మెగా ఈవెంట్లు నిర్వహించేందుకు మంత్రివర్గం అనుమతి ఇవ్వనుంది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో 281 పనులను హైబ్రిడ్ యాన్యువల్ మోడల్ (HAM)లో చేపట్టేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది.

లేబర్ అండ్ ఇండస్ట్రీస్ శాఖకు సంబంధించి 2019లో జగన్ ప్రభుత్వం ఆమోదించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ఇండస్ట్రీయల్ సవరణ బిల్లు, లేబర్ లాస్ బిల్లు, ఫ్యాక్టరీస్ సవరణ బిల్లులను వెనక్కి తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇవన్నీ కలిపి చూస్తే ఈరోజు జరగనున్న కేబినెట్ సమావేశం రాష్ట్ర పరిపాలన దిశను ప్రభావితం చేసే అనేక కీలక నిర్ణయాలకు వేదిక కానుంది.

Read More : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్