ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ టెక్నాలజీ వినియోగంతో పారదర్శకతతో కూడిన సంక్షేమాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సుపరిపాలనలో భాగంగా పలు సంస్కరణలు అమలు చేశామని చెప్పారు. ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. విజయవాడలో శుక్రవారం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ, మొదటి దశలో 9 జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేపడతామని తెలిపారు. వచ్చే నెల 15 వరకు నాలుగు విడతల్లో పండుగ వాతావరణంలో కార్డులు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇంటింటికీ వెళ్లి స్మార్ట్ రైస్ కార్డులను ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. మొత్తం 1.45 కోట్ల కుటుంబాలకు ఈ కార్డులు అందించనుండగా, కొత్తగా దరఖాస్తు చేసిన 6.70 లక్షల కార్డుదారులకూ ఇవి జారీ చేయనున్నట్టు వివరించారు.
స్మార్ట్ కార్డులను క్యూఆర్ కోడ్ వంటి ఆధునిక సాంకేతికతతో రూపొందించామని మంత్రి తెలిపారు. ఈ కార్డుతో స్వైప్ చేసి సరుకులు సులభంగా పొందవచ్చని, సరుకుల పంపిణీ సమాచారం వెంటనే కేంద్ర సర్వర్‌కు చేరుతుందని వివరించారు.
ప్రస్తుతం వృద్ధులు, వికలాంగుల కోసం 16.70 లక్షల మందికి సరుకులు డోర్ డెలివరీ చేస్తున్నామని గుర్తు చేశారు. ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇకపై ఎక్కడి వారు ఎక్కడినుంచైనా రేషన్ పొందగలరని తెలిపారు.
స్మార్ట్ కార్డుల వల్ల డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని, పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరుగుతుందని స్పష్టం చేశారు. మార్కెట్ ధరలు పెరిగిన సందర్భంలో పౌర సరఫరాల ద్వారా అదనపు సరుకులు తప్పనిసరిగా అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు.
Read More : ప్రతి ఏడాది టీచర్ పోస్టుల కోసం డీఎస్సీ నిర్వహణ: మంత్రి

One thought on “ఏపీలో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ: మంత్రి”
Comments are closed.