రైస్ కార్డుల్లో మార్పులు–చేర్పులు ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా మే 7వ తేదీ నుంచి రైస్ కార్డులకు సంబంధించి మార్పులు, చేర్పులు చేపట్టామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, గత రెండేళ్లుగా రైస్ కార్డుల్లో మార్పులు చేసుకునే అవకాశం లేకపోయిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించామని చెప్పారు.

ఈకేవైసీ ప్రక్రియ తప్పనిసరిగా నిర్వహించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుందని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 4,24,59,028 మందికి ఈకేవైసీ పూర్తయిందని, కేవలం 22,59,498 మందికే ఈ ప్రక్రియ పూర్తికాలేదని మంత్రి తెలిపారు. దేశంలో అత్యధిక ఈకేవైసీ పూర్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని అభిప్రాయపడ్డారు.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల అప్లికేషన్లు మాత్రమే వచ్చినట్లు వెల్లడించారు. కొత్త రైస్ కార్డుల కోసం 60 వేల మంది దరఖాస్తు చేశారని, కుటుంబ విభజన (స్ప్లిటింగ్) కోసం 44 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. చిరునామా మార్పు కోసం 12,500 మంది దరఖాస్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలకి రైస్ కార్డుల డేటాను అనుసంధానం చేశామని మంత్రి తెలిపారు. అయితే గత 15 రోజులుగా కొన్ని సాంకేతిక లోపాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అంగీకరించారు. సర్వర్లు డౌన్ కావడం, సచివాలయాల్లో అప్లికేషన్లను పూర్తిగా స్వీకరించలేకపోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తినట్లు వివరించారు.

ఈ నేపథ్యంలో ప్రజలకు కలిగిన అసౌకర్యం పట్ల మంత్రి క్షమాపణలు తెలిపారు. గత మూడు రోజులుగా కమిషనర్ సహా ఇతర ఉన్నతాధికారులు నిరంతరం పనిచేస్తున్నారని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులను అవసరమైన సూచనలు చేశామని తెలిపారు. ఇది కొనసాగించే ప్రక్రియ అని, ప్రజలు తొందరపడవద్దని సూచించారు. రేషన్ దరఖాస్తులకు గడువు లేదని, అర్హత ఉన్న వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి వైట్ రేషన్ కార్డు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

Read More : మళ్లీ ఢిల్లీకి సీఎం చంద్రబాబు…

One thought on “రైస్ కార్డుల్లో మార్పులు–చేర్పులు ప్రారంభం

Comments are closed.