ఏపీలో మెడికో విద్యార్థుల నిరసనపై పోలీసుల దౌర్జన్యం

ఆంధ్రప్రదేశ్‌లో మెడికో విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలోని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వద్ద శుక్రవారం నిరసన చేపట్టిన వైద్య విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ సందర్భంగా కొందరిని బలవంతంగా ఈడ్చుకెళ్లిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ మంజూరు చేయకుండా, స్టైఫండ్ కూడా అందకుండా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆందోళన చెందుతున్న మెడికోలు… న్యాయం కోరుతూ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో మహిళా విద్యార్థినులను కూడా పోలీసులు బలవంతంగా తోసి లాగడంతో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. “కడుపులోకి తొక్కారు” అంటూ మహిళా విద్యార్థినులు కన్నీరు మున్నీరయ్యారు. తాము ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ను 6 నెలల క్రితం కలిసి సమస్యను వివరించామని, కానీ ఎలాంటి స్పందన లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా APMC రిజిస్ట్రార్ ఐ. రమేష్ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి. తాను ఉన్నంతవరకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వబోనని చెప్పారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఆడ, మగ అనే తేడా లేకుండా అందరినీ పోలీసులు అరెస్టు చేసి, ట్రక్కుల్లో తోసికొట్టి తరలించారని విద్యార్థులు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థుల సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి.

Read More : ఏపీలో జూలై 10న ‘తల్లికి వందనం’ రెండో విడత నగదు పంపిణీ

One thought on “ఏపీలో మెడికో విద్యార్థుల నిరసనపై పోలీసుల దౌర్జన్యం

Comments are closed.