ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా సీఎం ప్రయత్నం.

ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం విశాఖపట్నంలోని నోవాటెల్‌లో జరిగిన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా రోడ్లు, రైలు, సముద్రం, ఎయిర్ లాజిస్టిక్స్ రంగాలను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. రోడ్లను అనుసంధానం చేసినట్లే, భవిష్యత్తులో నదులను కూడా కలపాలని నిర్ణయించామని చెప్పారు. ఇళ్లపైనే విద్యుత్ ఉత్పత్తి చేసుకునే స్థాయికి రాష్ట్రం చేరుకుందని గుర్తు చేశారు.

ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. ఏపీ ఫార్మా, ఆక్వా, వ్యవసాయ రంగాలలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. పోర్టులు, కార్గో రంగాల అభివృద్ధిపై ముల్లర్ మార్క్‌తో ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు. షిప్ బిల్డింగ్ రంగంలో దేశం వెనుకబడి ఉందని, ఆ లోటును ఏపీ తీర్చగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు నుంచి నాలుగు ప్రాంతాల్లో షిప్ నిర్మాణానికి అనువైన స్థలాలు గుర్తించామని, ముందుకు వచ్చే పెట్టుబడిదారులతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

డిఫెన్స్, మెరైన్ షిప్ బిల్డింగ్, కంటైనర్ టెర్మినల్స్ ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. మంచి ప్రతిపాదనలతో వచ్చే సంస్థలకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని, వయబిలిటీ ఫండింగ్‌తో సహకరిస్తామని భరోసా ఇచ్చారు. లాంగ్ టర్మ్ భాగస్వాములు లాంగ్ టర్మ్ ప్రణాళికలతో రావాలని సూచించారు.

అదనంగా, విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు అవుతుందని, డేటా రంగంలో వైజాగ్ హబ్‌గా మారుతుందని వెల్లడించారు. జీఎంఆర్ సంస్థ రాష్ట్రంలో ఏవియేషన్ యూనివర్సిటీని స్థాపించనుందని తెలిపారు. రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ప్రజల సహకారం అత్యంత కీలకమని, వచ్చే ఆరు నెలల్లో మళ్లీ విశాఖలోనే మరో సమ్మిట్ నిర్వహిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Read More : రాజమండ్రి జైలులో మిథున్ రెడ్డిని పరామర్శించిన పేర్ని నాని.

One thought on “ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా సీఎం ప్రయత్నం.

Comments are closed.