అన్షుల్ ని ఎలా ఎంపిక చేస్తారు..? – సెలెక్టర్లపై ఫైర్

ఇంగ్లండ్ తో నాలుగో టెస్టు నేపథ్యంలో ఆల్ రౌండర్ అన్షుల్ కాంబోజ్ కొత్తగా టీమిండియాలోకి చేరాడు. స్టార్ క్రికెటర్లు గాయాలపాలు కావడంతో ఈ హర్యానా ఆటగాడికి బంపరాఫర్ దక్కింది. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి సిరీస్ లో మిగిలిన రెండు మ్యాచ్ లకు దూరం కాగా.. పేసర్ అర్ష్ దీప్ సింగ్ నాలుగో టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు.

మరోవైపు.. మరో పేసర్ ఆకాశ్ దీప్ ఫిట్ నెస్ పై కూడా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రైటార్మ్ పేసర్ అన్షుల్ కాంబోజ్ ను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సోమవారం అధికారికంగా వెల్లడించింది.

హర్షిత్ ని కాదని అన్షుల్ ను ఎలా ఎంపిక చేస్తారు?

అయితే, సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయం సరికాదంటూ భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా విమర్శించాడు. హర్షిత్ రాణాను కాదని అన్షుల్ కాంబోజ్ ను ఎలా పిలిపించారని ప్రశ్నించాడు. అసలు టీమిండియాలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

టీంఇండియాలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు..

కాగా ఇంగ్లండ్-‘ఎ’ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్ లో హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్ మెరుగైన ప్రదర్శన కనబరిచారు. అయితే, ఇంగ్లండ్ తో టెండుల్కర్- అండర్సన్ ట్రోఫీ జట్టులోకి అదనపు ఆటగాడిగా హర్షిత్ రాణాను తీసుకుని.. అక్కడే ఉంచింది యాజమాన్యం.

అయితే, హర్షిత్ ఎంపికపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. అతడు కొన్ని రోజులకే స్వదేశానికి తిరిగి రావడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఇలా గాయాల బెడద నేపథ్యంలో మేనేజ్మెంట్ అన్షుల్ ను పిలిపించింది.

అపుడు హర్షిత్.. ఇపుడు అన్షుల్ ఎందుకు?

ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. “హర్షిత్ రాణా లేడు. ఇపుడేమో ఇతడు. అసలు టీమిండియాలో ఏం జరుగుతోందని మనమంతా ఆశ్చర్యపోవాలా? ఎవరు జట్టులోకి వస్తారు? ఎవరిని ఎప్పుడు తీసేస్తారు? అన్న విషయాలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు? భారత్-ఎ తరఫున ప్రదర్శన గురించి మాట్లాడితే అన్షుల్ కాంబోజ్ మెరుగ్గా ఆడాడు. కానీ మీరు ముందుగా హర్షిత్ రాణాను టీమిండియాతో కొనసాగించేందుకు నిర్ణయించుకున్నారు. అలాంటపుడు అదే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సింది. కానీ ఇప్పుడు అతడు స్వదేశానికి వచ్చేశాడు. అన్షుల్ కాంబోజ్ ని అక్కడే ఉంచారు. అంతా గందరగోళంగా ఉంది. మేనేజ్మెంట్ కు ఈ విషయంలో స్పష్టత ఉండవచ్చేమో గానీ.. మనకు ఎవరూ ఏమీ చెప్పరు. అయినా, టీమిండియాలో ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఏదేమైనా అన్షుల్ కాంబోజ్ జట్టులోకి వచ్చేందుకు అర్హుడు. ఎట్టకేలకు అతడు టీమిండియాతో చేరాడు” అని పేర్కొన్నాడు.

కాగా, ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2024-25 సందర్భంగా 23 ఏళ్ల హర్షిత్ రాణా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్ లో రెండు మ్యాచ్ లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్-ఎ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ లో మాత్రం అతడు రెండు మ్యాచ్లలో కలిపి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు.

మరోవైపు.. 24 ఏళ్ల అన్షుల్ కాంబోజ్ నార్తాంప్టన్లో జరిగిన రెండో టెస్టులో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అంతేకాదు.. రెండో ఇన్నింగ్స్ లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీతో (51) మెరిశాడు. కాగా ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో గిల్ సేన ప్రస్తుతం 1-2తో వెనుకబడి ఉంది. ఇరుజట్ల మధ్య మాంచెస్టర్ (జూలై 23-27)లో నాలుగో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.

ఇంగ్లండ్ తో నాలుగో టెస్టుకు టీమిండియా (ప్రస్తుతమున్నఅప్డేట్ చేసిన ప్రకారం)

శుభ్ మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్ & వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్.

Read More : జట్టు రీ-ఎంట్రీ కోసం సర్ఫరాజ్ ఖాన్ కసరత్తు