అమరావతి పున:ప్రారంభానికి మోదీకి ఆహ్వానం

modi in amaravathi

నిర్మాణ పనుల ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అమరావతిలో పనులు ప్రారంభించేందుకు సీఆర్డీఏ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ముఖ్యంగా ప్ర‌ధాని నరేంద్ర మోదీ కోసం స్థల ఎంపికపై ఆయన అధికారులతో సమాలోచనలు జరిపారు.

ఈ సమావేశంలో మంత్రి నారాయణ కూడా పాల్గొన్నారు. రాజధాని పనుల పున:ప్రారంభంపై ప్రధానికి నివేదిక సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. నవనగరాల్లో ఇంకా ప్రారంభించాల్సిన పనులను గుర్తించి వాటిలో ఏవి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలనే అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీకి ఆహ్వానం అందించేందుకు సీఎం సిద్ధమవుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ కోసం ప్రత్యేకంగా ముహూర్త సమయం సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, అమరావతిలో పున:ప్రారంభ పనుల కోసం రూ.22 కోట్లకు పైగా వ్యయం చేయాలని కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ పనులను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే.

ముఖ్యమంత్రి ఢిల్లీ షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సీఎం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. అదేరోజు రాత్రి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబానికి చెందిన వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. రేపు మధ్యాహ్నం గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో సమావేశమై విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో సహకారం కోసం ఒప్పందాలు చేసుకోనున్నారు. సాయంత్రానికి సీఎం చంద్రబాబు తిరిగి అమరావతికి చేరుకోనున్నారు. అనంతరం 20వ తేదీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని రాత్రికి తిరుమలకు వెళ్లనున్నారు. 21న తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం తిరుగుప్రయాణం అవుతారు.

Read Mode

One thought on “అమరావతి పున:ప్రారంభానికి మోదీకి ఆహ్వానం

Comments are closed.