ఢిల్లీ శాసనసభ ఎన్నికలు: మాటల యుద్ధం మధ్య ఉత్కంఠ

ఎన్నికలు: ఢిల్లీలో ఓట్ల పండుగ.. కాసేపట్లో షెడ్యూల్

దేశ రాజధాని ఢిల్లీ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కాసేపట్లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. అధికార ఆప్ విజయం సాధించేందుకు వ్యూహాలను పదును పెడుతుండగా, బీజేపీ కూడా ఈసారి ఢిల్లీని గెలుచుకోవడానికి పావులు కదుపుతోంది. కాంగ్రెస్ మధ్యలో నిలిచి రెండు ప్రధాన పార్టీలను టార్గెట్ చేస్తోంది.

2013, 2015, 2020లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. వరుసగా నాలుగోసారి ఢిల్లీలో అధికారం చేజిక్కించుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఇక బీజేపీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది.

కేజ్రీవాల్ వ్యూహంలో మార్పు

మద్యం కుంభకోణం కేసు తర్వాత కేజ్రీవాల్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చారు. ముఖ్యమంత్రిగా తన పదవిని రాజీనామా చేసి, అతిషి మార్లేనాకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల ఫలితాల తర్వాతనే మళ్లీ సీఎం బాధ్యతలు తీసుకుంటానని కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే, ఆయన వరుసగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు.

ఒకే విడతలో పోలింగ్

ఢిల్లీ శాసనసభలో మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియను ఒకే విడతలో పూర్తి చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీజేపీకి, ఢిల్లీ శాసనసభలో మాత్రం ప్రజల మద్దతు సరిగా లభించలేదు. ఈసారి ఆప్‌ను ఓడించి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

త్రిముఖ పోరులో ఆసక్తి

ఆప్ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేస్తుండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. త్రిముఖ పోరులో విజయం సాధించేది ఎవరో చూడాల్సి ఉంది.

ఢిల్లీ ఓటర్ల తీర్పు ఎవరి వైపున్నదనేది రాజకీయ పరిశీలకుల్లో చర్చనీయాంశంగా మారింది.