ఎయిరిండియా విమానం గాల్లో 900 అడుగుల పతనం…

దేశం ఇప్పటికే అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద దుఃఖం నుంచి తేరుకోకముందే, మరో విమాన ఘటన కలకలం రేపుతోంది. ఢిల్లీ నుంచి వియన్నా వెళ్తున్న ఎయిరిండియా బోయింగ్ 777 విమానం గాల్లో అకస్మాత్తుగా 900 అడుగులు కిందకు దూసుకెళ్లింది. జూన్ 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఏం జరిగింది..?

విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వాతావరణం ఒక్కసారిగా మారింది. తీవ్ర గాలులతో కలసిన ప్రతికూల పరిస్థితుల మధ్య, విమానం అదుపు తప్పి 900 అడుగుల మేర భూమివైపు దూసుకెళ్లింది. ప్రమాద హెచ్చరికలు మోగడంతో పైలట్లు అప్రమత్తమై, సమయస్ఫూర్తితో విమానాన్ని మళ్లీ నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

డీజీసీఏ స్పందన

ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. తక్షణమే విచారణకు ఆదేశిస్తూ, ఇద్దరు పైలట్లను విధుల నుంచి తాత్కాలికంగా తప్పించింది. జూన్ 17న ఎయిరిండియా భద్రతా విభాగాధిపతికి సమన్లు జారీ చేస్తూ వివరణ కోరింది.

అహ్మదాబాద్ ఘటనతో ఆందోళన

ఇప్పటికే జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న బోయింగ్ డ్రీమ్‌లైనర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో 242 మంది ప్రయాణికుల్లో 241 మంది ప్రాణాలు కోల్పోగా, కేవలం ఒకరు మాత్రమే రక్షితులయ్యారు. ఈ రెండు ఘటనలతో విమాన ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

భద్రతా లోపాలపై విస్తృత తనిఖీలు

ఈ నేపథ్యంలో డీజీసీఏ దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో విస్తృత తనిఖీలు చేపట్టింది. పలు విమానాల్లో సాంకేతిక లోపాలు, విమానయాన సంస్థల్లో నియంత్రణ లోపాలు కనిపించినట్లు డీజీసీఏ నివేదిక వెల్లడించింది. పైలట్ శిక్షణకు ఉపయోగించే సాఫ్ట్‌వేర్ పాతదిగా ఉండటం, టైర్లు అరిగిపోవడం వంటి అంశాలపై కూడా డీజీసీఏ సీరియస్‌గా తీసుకుంది.

ఈ వరుస ఘటనలతో విమానయాన భద్రతపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికార యంత్రాంగం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని విమాన ప్రయాణికులు కోరుతున్నారు.

Read More : తమిళనాడు శివకాశిలో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు

One thought on “ఎయిరిండియా విమానం గాల్లో 900 అడుగుల పతనం…

Comments are closed.