ఎయిర్ ఇండియా 171 ప్రమాదంపై : ప్రాథమిక నివేదిక సమర్పణ

దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన ఎయిర్ ఇండియా 171 విమాన ప్రమాదంపై దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 241 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికను పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సమర్పించింది. జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఈ విమానం, టేకాఫ్ అయిన 32 సెకన్లకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది, 229 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. కేవలం సీటు నంబర్ 11ఏలో ఉన్న ఒక్క ప్రయాణికుడే గాయాలతో బయటపడటం మానవ చరిత్రలో అరుదైన సంఘటనగా నిలిచింది. దుర్ఘటన అనంతరం ఘటనాస్థలంలో అధికారులు సేకరించిన బ్లాక్‌బాక్స్ డేటా, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR), ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) ఆధారంగా కారణాలను ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. విమానం టేకాఫ్ సమయంలో ఫ్యూయల్ స్విచ్‌లు తప్పుగా ఆఫ్ చేశారా? లేదా ఒకేసారి రెండు ఇంజిన్లు ఫెయిల్ అయ్యాయా? అనే కోణాల్లో నిపుణులు దృష్టి సారించారు. విమానం 400 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఉండగా ఇంజిన్లు ఆగిపోతే ఎలా స్పందించాలన్న శిక్షణపై కూడా పలు సందేహాలు వెల్లివెళ్తున్నాయి.

ఈ పరిశీలనల ఆధారంగా రూపొందించిన ప్రాథమిక నివేదికను ఈ వారంలోనే ప్రజలకు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇది ప్రమాద కారణాలపై స్పష్టత ఇవ్వబోతోందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నివారించేందుకు మార్గదర్శకంగా మారనుందని భావిస్తున్నారు.

READ MORE : ఢిల్లీ ఆకాశంలో ఐఎస్‌ఎస్‌ అద్భుత దృశ్యం…