ఒక్కరు ప్రాణాలతో బయటపడిన విశ్వాశ్ కుమార్ కథ

అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశాన్ని విషాదంలోకి నెట్టింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఈ విషాద ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదంలో విశ్వాశ్ కుమార్ రమేశ్ అనే వ్యక్తి మాత్రం అద్భుతంగా ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

విశ్వాశ్ విమానంలో 11ఏ నంబర్ సీటులో ఎడమవైపు అత్యవసర ద్వారం పక్కన కూర్చున్నాడు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం గాల్లోనే ముక్కలైపోయిందని ఆయన చెప్పారు. ఆ సమయంలో తన సీటు విమానం నుంచి ఊడిపడి దూరంగా పడిపోయిందని వివరించారు. సీటు బెల్టు వేయడం వల్లే ప్రాణాలతో బయటపడ్డానని చెబుతున్న ఆయన ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం 1:39 గంటలకు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది. కానీ టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విమానం కేవలం 600 నుంచి 800 అడుగుల ఎత్తుకు చేరుకొని సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. కూలిపోతూ భారీగా మంటలు, పొగలు ఎగసిపడ్డాయి.

ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన వెంటనే పైలట్ అత్యవసర సంకేతంగా ‘మేడే’ సందేశాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు పంపినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారిక దర్యాప్తు ప్రారంభమైంది. ప్రస్తుతం బ్లాక్ బాక్స్ కోసం గాలింపు కొనసాగుతోంది.

Read More : ఒడిశాలో కులాంతర వివాహం పై గ్రామ పెద్దల అవమానకర చర్య

One thought on “ఒక్కరు ప్రాణాలతో బయటపడిన విశ్వాశ్ కుమార్ కథ

Comments are closed.