అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై నాయుడు కీలక ప్రకటన

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై స్పందించారు. “నా తండ్రి కూడా ఒక ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఈ విమాన ప్రమాదంలో ప్రభావితమైన కుటుంబాల బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను,” అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనను పౌర విమానయాన శాఖ అత్యంత గంభీరంగా తీసుకున్నదని చెప్పారు.

ఢిల్లీలో శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు రామ్మోహన్ నాయుడు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టామని, గుజరాత్ ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ సమన్వయంతో పనిచేసి మంటలను అదుపులోకి తెచ్చామని వెల్లడించారు. మృతదేహాలను సురక్షితంగా తరలించినట్లు తెలిపారు.

ఈ దుర్ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు కమిటీని తక్షణమే ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అవసరమైతే ఈ కమిటీలో మరిన్ని నిపుణులను చేర్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఘటనా స్థలంలో బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, దాని విశ్లేషణ తర్వాత పూర్తి సమాచారం వెల్లడి అవుతుందని తెలిపారు.

దర్యాప్తు ప్రక్రియను మరింత బలపడేందుకు హోంశాఖ సెక్రటరీ ఆధ్వర్యంలో మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, ఇందులో వివిధ రంగాల నిపుణులు, అధికారులు సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు. రెండు నెలల కాలంలో పూర్తి దర్యాప్తు నివేదికను సమర్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా బోయింగ్ 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనపై పూర్తి నివేదిక వెలువడే వరకు నిరీక్షిస్తున్నామని, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

Read More : ప్రమాదం తరువాత శకలాల తొలగింపు ప్రారంభం

One thought on “అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై నాయుడు కీలక ప్రకటన

Comments are closed.