లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ (Vijay) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయంగా మారుతుందని, దక్షిణాదికి చెందిన పార్లమెంటరీ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలు గత 50 ఏళ్లుగా జనాభా నియంత్రణలో అగ్రగామిగా నిలిచినప్పటికీ, తాజా జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజిస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని విజయ్ స్పష్టం చేశారు. “ఒకరి రాజకీయ గెలుపు కోసం మరొకరిని శిక్షించడం అన్యాయం. ఈ విధంగా పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గినా, ఉత్తరాది రాష్ట్రాల్లో అది పెరిగినా సహించేది లేదు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పోరాడతాం,” అని విజయ్ ఓ ప్రకటనలో తెలిపారు.
కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్
ఈ పునర్విభజనపై కేంద్రం ఆయా రాష్ట్రాలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని విజయ్ డిమాండ్ చేశారు. “ప్రజాప్రతినిధుల కొరత వల్ల సామాన్య ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నాణ్యమైన విద్య, వైద్యం, రోడ్లు వంటి ప్రాథమిక అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన కేంద్రం, దక్షిణాది రాష్ట్రాల హక్కులను కుదించే నిర్ణయాలను తీసుకోవడం సమంజసం కాదు,” అని విజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
తమిళనాడు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం
ఈ అంశంపై ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. 1971 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏకపక్ష నిర్ణయాన్ని తాము అంగీకరించబోమని, అవసరమైతే దీని కోసం సమగ్ర పోరాటం చేస్తామని స్టాలిన్ హెచ్చరించారు.
ఇదిలా ఉంటే, ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఇప్పటికే స్పందిస్తూ, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే వాదనను కొట్టిపారేశారు. అయినప్పటికీ, పలు దక్షిణాది రాష్ట్రాలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ కేంద్రాన్ని ఒప్పించేందుకు కసరత్తు చేస్తున్నాయి.

One thought on “లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై విజయ్ తీవ్ర వ్యతిరేకత”
Comments are closed.