భీమిలి బీచ్ అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

విశాఖపట్నం, మార్చి 6: విశాఖపట్నం భీమిలి బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. కోర్టు సీఆర్‌జడ్‌ (CRZ) నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డి వ్యాపార భాగస్వామిగా ఉన్న కంపెనీపై కూడా న్యాయస్థానం మండిపడింది.

అధికారులను ఆదేశించిన హైకోర్టు
గోడ నిర్మాణంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. ఫిర్యాదు ద్వారా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి మార్గం సిద్ధమవుతుందని స్పష్టం చేశారు.

పర్యావరణ నష్టంపై కమిటీ ఏర్పాటు
బీచ్‌లో నిర్మించిన గోడ తొలగించినప్పటికీ, ఆరు అడుగుల పునాదిని అలాగే వదిలేయడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. గోడ కూల్చివేత ఖర్చుతో పాటు, పర్యావరణ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ నష్టాన్ని నేహా రెడ్డి కంపెనీ నుంచే వసూలు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

రెస్ట్రో బార్లపై సర్వేకు ఆదేశం
ఇక భీమిలి ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న నలుగురు రెస్ట్రో బార్లపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కూడా విచారణ జరిగింది. హైకోర్టు రెస్ట్రో బార్లపై సర్వే చేసి నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.