కమల్ హాసన్ – తన తొలి ఓటమి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు
చెన్నై: ప్రముఖ నటుడు, మక్కల్ నీదిమయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్ తన రాజకీయ ప్రస్థానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దశాబ్దాల క్రితమే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే, తన స్థాయి మరింత ఎక్కువగా ఉండేదని ఆయన అన్నారు. అయితే, అప్పట్లో వెనుకంజ వేయడం తన తొలి ఓటమిగా అభివర్ణించారు.
శుక్రవారం ఆళ్వార్‌పేటలో జరిగిన ఎంఎన్ఎం పార్టీ ఎనిమిదో వార్షికోత్సవ సభలో కమల్ హాసన్ మాట్లాడుతూ, అభిమానులు ఒకరైతే, ఓటర్లు మరోకరని తన రాజకీయ ప్రయాణంలో గ్రహించానని అన్నారు. చివరి ఓటరు ఉన్నంత వరకు పార్టీ సేవలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
తమిళ భాషకు కమల్ హాసన్ గౌరవ వందనం
ఇరవై ఏళ్ల క్రితమే తాను రాజకీయాల్లోకి వచ్చి ఉంటే, మరింత ఎదిగేవాడినని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. తమిళ ప్రజల ప్రోత్సాహం, వారి భాష పట్ల ఉన్న గౌరవం తనకు ముందుకు సాగేందుకు నడిపిస్తున్నాయని అన్నారు. ఆకాశమంత ఎదిగిన తమిళ భాషను ఎవరూ కించపరచలేరని పేర్కొన్నారు.
ఎంఎన్ఎం పార్టీ భవిష్యత్తు
ఈ ఏడాదిలోనే పార్లమెంటులో ఎంఎన్ఎం పార్టీ గొంతుస్వరం వినిపించనుందని, వచ్చే ఏడాది అసెంబ్లీలో పార్టీ ప్రాతినిధ్యం ఉంటుందని కమల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నదే తమ లక్ష్యమని, అప్పుడే పార్టీకి బలమైన భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.
