తెలంగాణ రాజకీయాల్లో కొత్త దుమారం చెలరేగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని కాపాడేందుకు రేవంత్ రెడ్డి ‘బ్యాగ్ మ్యాన్’గా మారారని ఆయన ఆరోపించారు. రాజకీయ లాభాల కోసమే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ఇటీవల ప్రగతిభవన్‌లో జరిగిన నీటిపారుదల శాఖ ప్రజెంటేషన్‌పై స్పందించిన హరీశ్ రావు, “ఇది హైదరాబాద్‌లో కాదు.. అమరావతిలో చేసిన ప్రజెంటేషన్ అనిపిస్తుంది. ఆ ప్రజెంటేషన్‌ను ఏపీ ప్రభుత్వమే తయారు చేసి ఇచ్చింది అనుమానం వస్తోంది” అని వ్యాఖ్యానించారు. బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని దాచిపెట్టడం కావాలని, చంద్రబాబును దేవుడిగా చూపించి బీఆర్ఎస్‌ను విమర్శించడం దారుణమన్నారు. “బీఆర్ఎస్ చచ్చిన పామైతే, దాన్ని నిద్రలో కూడా కలల్లో చూడాల్సిన అవసరం ఏంటి?” అని కాంగ్రెస్ నేతలపై ఘాటుగా ప్రశ్నించారు. టెక్నికల్‌గా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయినా, ఆయన మనసంతా ఆంధ్రప్రదేశ్‌వైపు ఉందని విమర్శించారు. బనకచర్ల అంశంపై తెరవెనుక ఒప్పందాలు జరిగాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి బెజవాడ వేదికగా బనకచర్లకు పచ్చజెండా ఊపారని గుర్తు చేశారు.
అలాగే నవంబర్ 15న, డిసెంబరులోనూ చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రికి లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ విషయాలపై రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని హరీశ్ ప్రశ్నించారు. జనవరి 24న తానే ఈ కుట్రను బహిర్గతం చేశానని, ఆ తర్వాతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనుక తేదీ వేసి లేఖ రాశారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పోరాటం వల్లే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన టీఓఆర్ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిందని హరీశ్ స్పష్టం చేశారు. నదీ జలాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడితే ప్రజలు తగిన శిక్ష విధిస్తారని హెచ్చరించారు.
Read More : CM : హైదరాబాద్‌లో ఏఐజీ హాస్పిటల్ ప్రారంభం

One thought on “హరీశ్ రావు తీవ్ర విమర్శలు”
Comments are closed.