జేఎన్టీయూ హైదరాబాద్ విద్యార్థులకు శుభవార్త అందించింది. యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలు, కార్యాలయాలకు ఇకపై ప్రతి నెలలో నాలుగో శనివారం సెలవు ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ కే వెంకటేశ్వర రావు గురువారం దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువరించారు. ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి రానుంది.
జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) తాజాగా ప్రకటించిన ఈ నిర్ణయం విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిలో ఆనందాన్ని కలిగించింది. 2008కి ముందు కూడా నాలుగో శనివారం సెలవు అమలులో ఉండగా, ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఈ విధానాన్ని రద్దు చేశారు. తాజాగా, నూతన వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విధానాన్ని తిరిగి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
యూనివర్సిటీ పరిధిలోని అన్ని విభాగాలు ఈ మార్పును పాటించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని యాజమాన్యం సూచించింది. ఈ నిర్ణయంతో విద్యార్థులు అదనపు విశ్రాంతి పొందే అవకాశం కలిగింది.
