Sr NTR: నటసార్వభౌముడికి ఘన నివాళి
తెలుగు జాతికి గర్వకారణం, నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ఘనంగా నివాళులు అర్పించేందుకు శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీకి తెలంగాణ ప్రభుత్వ మద్దతు లభించింది.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యులు మధుసూదన రాజు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
అలాగే హైదరాబాద్లో 100 అడుగుల ఎత్తుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పాలని సంకల్పాన్ని వివరించారు. దానికి తోడు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేసి, ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించి సహకరించాల్సిందిగా కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి దీనికి సానుకూలంగా స్పందించి, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు.
దీంతో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ వార్తతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందోత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నారు.
