గ్రామాల నుండి వచ్చే ఆదాయాన్ని ఆ గ్రామాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నామని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి, అనంతరం తిరుపతి నగరపాలక సంస్థ మరియు తుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన, గత వైసీపీ ప్రభుత్వం ప్రజావసరాలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఆ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పుతో పాటు 85 లక్షల టన్నుల చెత్తను రాష్ట్రానికి మిగిల్చి వెళ్లిందని చెప్పారు.
చెత్త నిల్వల వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని ఎన్జీటీ, సుప్రీం కోర్టు పలుమార్లు హెచ్చరించినప్పటికీ, గత ప్రభుత్వానికి చలనం రాలేదని మంత్రి నారాయణ అన్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు అక్టోబర్ 2వ తేదీ లోపు పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించాలని ఆదేశించారని వెల్లడించారు.
“ఇప్పటికే 85 లక్షల టన్నుల చెత్తలో 73 లక్షల టన్నులను తొలగించాం. మిగిలిన చెత్తను త్వరలోనే తొలగిస్తాం. అదేవిధంగా రాష్ట్రంలోని ఆరు కేంద్రాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 123 మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి” అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
Read More : ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీ

One thought on “ఏపీ పట్టణాల్లో చెత్త సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కసరత్తు.”
Comments are closed.