ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ముందు విద్యార్థులపై పోలీసులు చేసిన ముందస్తు అరెస్టులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, పిరికిపంద చర్య అని ఆయన పేర్కొన్నారు. అరెస్టయిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్క విద్యార్థిపై అయినా లాఠీ దాడి జరిగితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. విద్య, హోమ్ శాఖలను తన వద్దే ఉంచుకోవడం వెనుక ఉద్దేశం ఇదేనా? అని సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా ప్రశ్నించారు. విద్యార్థులు మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ సమాజమే మీరు ఇచ్చిన మోసపూరిత హామీల గురించి నిలదీస్తుందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పాలననే ఏడో గ్యారంటీగా చెప్పి, ఇప్పుడు అత్యవసర పరిస్థితులను గుర్తు చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
గత 22 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన పనులేమీ లేవని, కేవలం కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేయడం, ఆయన శంకుస్థాపన చేసిన నిర్మాణాలను ప్రారంభించడం తప్ప మరేం చేయలేదని హరీష్ రావు ఆరోపించారు. జాబ్ క్యాలెండర్‌ను “జాబ్ లెస్ క్యాలెండర్”గా మార్చారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని, నిరుద్యోగ భృతి పేరుతో ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు.
విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. నెలల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న యువతను పట్టించుకోకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. గ్రంథాలయాల్లో పోలీసు లాఠీచార్జీలు జరిపిన చరిత్ర కాంగ్రెస్‌కే చెందుతుందని ఆరోపించారు.
నిరుద్యోగుల నిరసనలను ఆంక్షలతో ఆపలేరని, ఇనుప కంచెలు, పోలీస్ బలగాలతో ప్రజా గళాన్ని మూయలేరని స్పష్టం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు సింహాల్లా గర్జించి మీ మోసాలను బయట పెడతారని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఉస్మానియాకు సాక్షిగా విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పలు భవనాలను ప్రారంభించి, ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే, విద్యార్థులు ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు ముందస్తు అరెస్టులు జరిపారు. దీనిపై హరీష్ రావు తన ఎక్స్ ఖాతా వేదికగా తీవ్రంగా స్పందించారు.
Read More : ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

One thought on “సీఎం పై హరీష్ రావు తీవ్ర విమర్శలు”
Comments are closed.